ASI Murder: ఏఎస్ఐని చంపిన ప్రియుడు.. గుజరాత్ లో ఘటన

CRPF Jawan Arrested for Murdering Woman ASI Arunaben
  • ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే లొంగిపోయిన ప్రియుడు
  • ఏఎస్ఐతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు వెల్లడి
  • తన తల్లిని దూషించడంతో తట్టుకోలేక గొంతుకోశానని వివరణ
ఆమె అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, అతడేమో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా శుక్రవారం రాత్రి ఆగ్రహం పట్టలేక ప్రియుడు ఆమె గొంతుకోసి చంపేశాడు. శనివారం ఉదయం ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కే వెళ్లి లొంగిపోయాడు. గుజరాత్ లోని కచ్ లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజార్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అరుణాబెన్ సతుభాయ్ జాదవ్ కు 2021లో సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ దిలీప్ డాంగ్చియాతో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దిలీప్ డాంగ్చియా ప్రస్తుతం మణిపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు చెప్పారు.

వివాహం చేసుకునే విషయంపైనే శుక్రవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో దిలీప్ ఆగ్రహం పట్టలేక అరుణాబెన్ గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా అరుణాబెన్ అక్కడికక్కడే చనిపోయింది. తెల్లవారిన తర్వాత నేరుగా అరుణాబెన్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దిలీప్.. అరుణాబెన్ ను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. ఏఎస్ఐ అరుణాబెన్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, తన తల్లిని తీవ్రంగా దూషించడంతో కోపం పట్టలేక అరుణాబెన్ ను చంపేసినట్లు దిలీప్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు.
ASI Murder
CRPF Constable
Arunaben Sathubhai Jadav
Gujarat Crime
Kutch Murder
Live-in Relationship Murder
Gujarat Police
Crime News India

More Telugu News