Anshul Kamboj: గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో భారత జట్టులోకి అన్షుల్ కాంబోజ్‌

Anshul Kamboj added to India squad as cover for injured Arshdeep Singh says Reports
  • ప్రాక్టీస్ సమయంలో అర్ష్‌దీప్ సింగ్ చేతికి గాయం
  • ఇటీవల ఇంగ్లండ్‌లో ఇండియా A తరపున ఆడిన అన్షుల్ కాంబోజ్ 
  • ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడ్డ భారత్
గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను చేర్చారు. ఈ నెల‌ 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే సిరీస్‌లోని నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు, ప్రాక్టీస్ సమయంలో టీమిండియా బౌల‌ర్‌ అర్ష్‌దీప్ చేతికి గాయ‌మైంది. దీంతో అత‌ని స్థానంలో హ‌ర్యానా సీమ‌ర్ అన్షుల్ కాంబోజ్‌ను భార‌త జ‌ట్టులోకి తీసుకున్నారు.  

రంజీలో అన్షుల్ కాంబోజ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ 
రంజీ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా రికార్డుకెక్కిన ఈ హర్యానా సీమర్ ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. 2024-25 సీజన్‌లో కేరళతో రోహ్‌తక్‌లో జరిగిన హర్యానా ఐదవ రౌండ్ మ్యాచ్‌లో అతను 30.1 ఓవర్లలో 10/49 గణాంకాలను నమోదు చేసి ఈ ఘనతను సాధించాడు.

ఫలితంగా 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీ చ‌రిత్ర‌లో బెంగాల్‌కు చెందిన ప్రేమాంగ్షు ఛటర్జీ (10/20), రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సుందరం (10/78) తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. కాంబోజ్ ఒక సీమ్ ఆల్ రౌండర్. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 3.10 ఎకానమీ, 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు. అలాగే లిస్ట్-ఏ, టీ20 క్రికెట్‌తో క‌లిపి అతడు 74 వికెట్లు కూడా తీశాడు.

ఇదిలాఉంటే.. ఐదు మ్యాచ్‌ల టెండూల్క‌ర్‌-అండ‌ర్స‌న్ టెస్టు సిరీస్‌లో ప్ర‌స్తుతం భార‌త్ 1-2 తేడాతో వెనుకబ‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో 23 నుంచి ప్రారంభ‌మ‌య్యే నాలుగో టెస్టులో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమిండియా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని చూస్తోంది. మ‌రోవైపు మూడో టెస్టులో అద్భుత‌మైన‌ విజ‌యంతో ఆతిథ్య ఇంగ్లండ్ ఊపుమీద ఉంది. త‌దుప‌రి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని భావిస్తోంది.  
Anshul Kamboj
Arshdeep Singh
India vs England
Test Series
Indian Cricket Team
Ranji Trophy
Haryana Cricket
Cricket Injury
Cricket News
Old Trafford

More Telugu News