Pakistan: పాక్‌లో రుతుపవనాల ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు.. 200 మందికి పైగా మృతి!

Monsoon fury claims over 200 lives in Pakistan
  • రుతుపవనాల ప్రభావంతో గ‌త కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు
  • వర్షాకాలం ప్రారంభం నుంచి 202 మంది ప్రాణాలు కోల్పోయిన వైనం
  • మృతుల్లో 96 మంది పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా వెల్ల‌డి
  • పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 123 మంది మృతి
పాకిస్థాన్‌లో రుతుపవనాల ప్రభావంతో గ‌త కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం, వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దాదాపు సగం మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. 

మృతుల్లో 96 మంది పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధిక మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక్క‌డ‌ 123 మంది మృతిచెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40 మంది, సింధ్‌లో 21 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది, ఇస్లామాబాద్, ఆజాద్ జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు మరణించారని ప్రముఖ పాకిస్థాన్ మీడియా సంస్థ జియో న్యూస్ నివేదించింది.

మృతుల్లో కనీసం 118 మంది ఇళ్ళు కూలిపోవడంలో మరణించారు. అలాగే 30 మంది ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు పిడుగుపాటు, విద్యుత్ షాక్, కొండచరియలు విరిగిపడటం వల్ల చ‌నిపోయారు. కాగా, కుండపోత వర్షాలు కొనసాగుతున్నందున, జాతీయ అత్యవసర కార్యకలాపాల కేంద్రం (NEOC) మొత్తం దేశాన్ని కవర్ చేస్తూ ప్రభావ ఆధారిత వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్‌లోని వ‌ర‌ద‌ ప్ర‌భావిత‌ జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచారు.
Pakistan
Pakistan Floods
Monsoon Rains
NDMA
National Disaster Management Authority
Flooding
Rainfall
Khyber Pakhtunkhwa
Punjab
Sindh

More Telugu News