Chandrababu Naidu: పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Reminisces College Days Urges Plastic Ban
  • తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
  • స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగం
  • యువతే ఈ దేశానికి సంపద అని వెల్లడి
  • ప్రపంచంలో ఎక్కడ చూసినా నూటికి 30 మంది మనవాళ్లే ఉన్నారని హర్షం
పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు.

ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆతర్వాత తిరుపతి బయలుదేరి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగమవ్వండి

యువత ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉంది. యువతే ఈ దేశానికి సంపద. ప్రపంచంలో ఎక్కడ చూసినా నూటికి 30 శాతం మంది మనవారే ఉన్నారు. పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగి 4వ సారి ముఖ్యమంత్రి అయ్యానంటే ఏడుకొండల స్వామి ఆశీస్సులే కారణం.  

అవార్డులు పారిశుధ్య కార్మికుల కృషితోనే!

జాతీయస్థాయిలో మన రాష్ట్రానికి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం సంతోషాన్ని ఇస్తోంది. స్వచ్ఛ్ సూపర్ లీగ్ 2024-25కు తిరుపతి, గుంటూరు, విజయవాడకు గుర్తింపు దక్కింది. ఇందులో విజయవాడ దేశంలోనే 4వ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీల్లో విజయవాడ 7వ స్థానంలో నిలిచింది. ఫై మిత్ర సురక్షిత షెహర్ కేటగిరీలో విశాఖపట్నంకు మొదటి ర్యాంక్ వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్‌గా రాజమండ్రికి గుర్తింపు దక్కింది.  ఈ అవార్డులు రావడానికి కారణమైన పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలు అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. 

ప్లాస్టిక్ భూతానికి ఎవరూ బలికావద్దు

పర్యావరణానికి ప్లాస్టిక్ అతిపెద్ద భూతంగా తయారైంది.  ఈ భూతానికి ఎవరూ బలికాకూడదు. ఉదయం పళ్లు తోముకునే బ్రష్ నుంచి ఆహారం తినే ప్లేట్ వరకు అన్నింటా ప్లాస్టిక్ ఉంది. రోజు వాడి పడేసే బాటిళ్లు, కప్పులు, కవర్లు ప్రమాదకరమైనవి. ఇవి నీటిని, నేలను కలుషితం చేస్తున్నాయి. క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కారణం. భూమిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువై వర్షం నీరు భూమిలోకి ఇంకదు. మొక్కలు మొలకెత్తవు. నీటి మూలాలు మూసుకుపోతాయి. భూగర్భ జలాలు పడిపోతాయి. ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

ఆగస్టు15 నాటికి ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయం

ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్టోబర్ 2 కల్లా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, డిసెంబర్ నాటికి రాష్ట్రమంతా దీన్ని అమలు చేస్తాం. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాం. స్వయం సహాయ సంఘాల ద్వారా గుడ్డ సంచులు పంపిణీ చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదు. ప్రతి దాని నుంచి సంపద సృష్టించవచ్చు. 

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

‘స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్చాంధ్ర సాధించాలి. దీనికోసం సర్య్కలర్ ఎకానమీకి నాంది పలకాలి. సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు పెట్టాం. వినియోగించిన నీటిని లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కింద పరిశుభ్రం చేసి పొలాలకు పంపుతాం. అక్టోబర్ 2 నాటికి 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తీయిస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌కు 100 శాతం చెత్త క్లియర్ చేస్తాం.

గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి

చిన్నప్పుడు కరెంటు లేక లాంతర్ వెలుతురులోనే చదువుకున్నాను. నేడు ఇంటిపైనే సోలార్ కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. 20 లక్షల ఇళ్లపై సోలార్ కరెంటు అనుమతించాం. ఇల్లూ, ఆఫీస్, పొలాలు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఒకప్పుడు కరెంటు బొగ్గుతో తయారయ్యేది. నేడు విండ్ కరెంటు వచ్చింది. గ్రీన్ ఎనర్జీపై నేను శ్రద్ధ పెట్టాను. గ్లోబల్ వార్మింగ్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం గ్రీన్ ఎనర్జీనే... అని అని ముఖ్యమంత్రి అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Swachh Andhra
Plastic Waste
Tirupati
Waste Management
Cleanliness Drive
Municipal Corporation
Green Energy
Sustainable Development

More Telugu News