Ashwini Vaishnaw: 2026లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnaw Kazipet Railway Coach Factory Production Starts in 2026
  • నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి
  • కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అని వ్యాఖ్య
  • త్వరలో 150 లోకోమోటివ్‌లు ఎగుమతి అవుతాయని వెల్లడి
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు.

పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాజీపేట నుంచి త్వరలో 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయారవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు.

వరంగల్‌కు ఇప్పటికే విమానాశ్రయం రావాల్సి ఉందని, ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగామని గుర్తు చేశారు. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని కిషన్ రెడ్డి అన్నారు.
Ashwini Vaishnaw
Kazipet railway coach factory
railway coach factory
Kishan Reddy

More Telugu News