Mohammed Shami: దేశవాళీ సీజన్ కోసం బెంగాల్ జ‌ట్టులో మహ్మద్ షమీకి చోటు

Mohammed Shami included in Bengals probables list for upcoming domestic season
  • గాయం కారణంగా ఇంగ్లండ్‌ పర్యటనకు దూర‌మైన ష‌మీ
  • వ‌చ్చే దేశ‌వాళీ సీజన్ కోసం బెంగాల్ ప్ర‌క‌టించిన‌ 50 మంది సభ్యుల జాబితాలో చోటు
  • ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడని పేస‌ర్‌
పేస‌ర్ మహమ్మద్ షమీ ఇటీవల తరచుగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కు కూడా గాయం కారణంగానే అతడిని సెలెక్టర్లు పక్కనబెట్టారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాబోయే 2025-26 దేశ‌వాళీ సీజన్ కోసం బెంగాల్ ప్రకటించిన 50 మంది ఆటగాళ్ల జాబితాలో ఈ ఫాస్ట్ బౌలర్ చోటు దక్కించుకున్నాడు.

34 ఏళ్ల షమీ ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, అనుకున్న స్థాయిలో రాణించ‌లేదు. ఇక‌, టీమిండియా తరపున 2025 ఛాంపియన్స్ ట్రోఫీ బ‌రిలోకి దిగాడు. భార‌త జ‌ట్టు విజేత‌గా నిలవ‌డంలో త‌న‌వంతు పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చక్రవర్తితో సమంగా నిలిచాడు. ఈ ఇద్ద‌రూ టోర్నీలో తొమ్మిది వికెట్లు పడగొట్టారు.

2023 వన్డే ప్రపంచ కప్ లో గాయ‌ప‌డిన‌ త‌ర్వాత ష‌మీ త‌న చీలమండకు స‌ర్జ‌రీ చేయించుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కోలుకుని పున‌రాగ‌మ‌నం గ‌ట్టిగానే చేశాడు. రంజీ ట్రోఫీలో అత‌డు మధ్యప్రదేశ్‌పై ఆడిన‌ బెంగాల్ ఆడిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు పడగొట్టడంతో పాటు కీలకమైన 37 పరుగులు చేసి, బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ త‌ర్వాత 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు వైట్-బాల్ మ్యాచ్‌లలో ఆడటం ద్వారా 34 ఏళ్ల షమీ విజయవంతంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు తాను ఫిట్‌గా లేనని ప్రకటించడంతో షమీని ఎంపిక చేయలేదు. ఇప్పుడు రాబోయే దేశ‌వాళీ సీజ‌న్ కోసం బెంగాల్ జ‌ట్టులో ష‌మీ చోటు ద‌క్కించుకున్నాడు. ఆయ‌న‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్‌ దీప్, ముఖేశ్‌ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిషేక్ పోరెల్ వంటి కీల‌క ప్లేయ‌ర్లు బెంగాల్ విడుదల చేసిన 50 మంది సభ్యుల ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నారు.
Mohammed Shami
Bengal Cricket
Indian Cricket
Domestic Season
Ranji Trophy
Cricket
Abhimanyu Easwaran
Akash Deep
Mukesh Kumar
Shahbaz Ahmed

More Telugu News