Sivashankar Mitra: పని ఒత్తిడి భరించలేక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

Work Stress Leads to Bank Managers Suicide in Maharashtra
  • పూణె జిల్లాలోని బారామతిలో ఘటన
  • సిబ్బందితోనే తాడు తెప్పించుకున్న మేనేజర్
  • బ్యాంకును తాను మూసేస్తానని చెప్పి సిబ్బందిని పంపించేసిన మేనేజర్
  • రాత్రి 10గంటల సమయంలో ఉరి వేసుకున్న మేనేజర్
  • సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
పని ఒత్తిడి భరించలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర, పూణె జిల్లాలోని బారామతిలో ఈ ఘటన జరిగింది. బ్యాంకు మేనేజర్ శివశంకర్ మిత్రా (40) తాను పనిచేసే బ్యాంకు ఆవరణలోనే గురువారం రాత్రి ఉరివేసుకున్నారు. ఆరోగ్య సమస్యలు, పనిభారం మోయలేకపోవడంతో చీఫ్ మేనేజర్ పదవికి రాజీనామా చేస్తూ ఈ నెల 11న ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన నోటీస్ పిరియడ్‌లో ఉన్నారు. 

గురువారం బ్యాంకు పనివేళలు ముగిసిన తర్వాత బ్యాంకును తాను మూసివేస్తానని చెప్పి సిబ్బందిని పంపించివేశారు. వాచ్‌మన్ కూడా రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లిపోయాడు. మిత్రా అంతకుముందు తన సహచరులతో తాడును తెప్పించుకున్నారు. ఆ తాడుతో రాత్రి 10 గంటల సమయంలో ఉరి వేసుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. 

మిత్రా ఇంటికి రాకపోవడం, కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన భార్య అర్ధరాత్రి బ్యాంకుకు చేరుకున్నారు. లైట్లు వేసి ఉండటం, పిలిచినా పలకకపోవడంతో బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారొచ్చి బ్యాంకును తెరిచి చూడగా మిత్రా సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మిత్రా అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Sivashankar Mitra
Bank Manager Suicide
Pune Bank Manager
Baramati Suicide
Work Stress
Bank Job Pressure
Suicide Note
Maharashtra News
Banking Sector
Job Stress

More Telugu News