Payyavula Keshav: రెవెన్యూ రాబడి పెరిగేలా కృషి చేయాలి: వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి పయ్యావుల

Payyavula Keshav Focuses on Revenue Growth with Commercial Taxes Department
  • సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రెవెన్యూ రాబడి పెరిగేలా కృషి చేయాలన్న మంత్రి పయ్యావుల 
  • అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ఆదర్శంగా ఉండాలని సూచన 
  • వ్యాట్  పన్నులు పెంచేందుకు పనిచేసిన వారికి అవార్డులు అందిస్తామన్న మంత్రి
రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పనితీరు దేశానికే ఆదర్శమని, వారు పనితీరులో ఎవ్వరికీ తీసిపోరని ఏపీ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తాడేపల్లిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల సంస్థ కార్యాలయంలో నిన్న జేసీ, డీసీ (జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లు) లతో ఏర్పాటు చేసిన రెవెన్యూ వర్క్ షాపు కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు తమ అనుభవాన్ని ఉపయోగించి సంస్థ మరింత పురోభివృద్ధి చెంది ఆదాయాన్ని ఆర్జించేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అధికారులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యాపారాలు చేసుకొనే ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా జీఎస్టీ పన్నుల రెవెన్యూను పెంచాలన్నారు. ఇందులో ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పరంగా అధికారులకు అండగా ఉంటామని తెలిపారు.

ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత ముఖ్యమో అదే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యమన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించామని ఇందుకు టీమ్‌గా పనిచేసిన సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయ్యిందని ఇంకా మరింత బాధ్యతాయుతంగా అధికారులు, సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నెలలోపు శాఖ ప్రగతిలో మార్పులు తప్పనిసరిగా కనిపించాలని అన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. అదే స్ఫూర్తిని తీసుకుని తాను కూడా ఎంతో ఇష్టంగా పనిచేస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు కూడా సమర్థవంతంగా తమ సేవలను రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళుతుందన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చే ఆయిల్ తదితర దిగుమతులు చేసుకునే వాళ్లు పన్ను వసూళ్ల నుంచి తప్పించుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వాటిని సమర్థవంతంగా అరికట్టాలన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్స్‌ను సమర్థవంతంగా అరికట్టే విధంగా ఇతర శాఖలతో కలసి జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా తనిఖీలతో వాటిని సరిచేయాలన్నారు. ఫీల్డ్‌లో సమర్ధవంతంగా పనిచేసినప్పుడే మనం ఆశించిన రిజల్ట్స్ వస్తాయన్నారు.

వ్యాట్ పన్నులు పెంచేందుకు పనిచేసిన వారికి అవార్డులు అందిస్తామని మంత్రి తెలిపారు. యానాం నుంచి మన రాష్ట్రానికి డీజిల్ దిగుమతి అవుతుందనే సమాచారం ఉందని అలాంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రెవెన్యూ వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఏ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి రవి శంకర్, రాష్ట్ర పన్నుల ప్రత్యేక కార్యదర్శి సౌమ్య నూతలపాటి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు. 
Payyavula Keshav
Andhra Pradesh
Commercial Taxes Department
Revenue generation
GST
Tax collection
Chandrababu Naidu
State development
Investments
Tax Evasion

More Telugu News