Nadendla Manohar: మార్కెట్ ధరల పర్యవేక్షణపై నాదెండ్ల ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశం

Nadendla Manohar Oversees Meeting on Market Price Monitoring
  • ఏపీ రాష్ట్ర సచివాలయంలో సమావేశం
  • హాజరైన నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడు, సత్యకుమార్
  • నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నామన్న నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నిత్యావసర వస్తువుల మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం సమావేశం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలపై రోజువారీ సమీక్ష, ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రత్యేక చర్యలు, వరిపై మార్కెట్ రుసుమును 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించే ప్రతిపాదనపై చర్చించారు. 

అలాగే, టమాటా ఉత్పత్తిపై అంచనాల ఆధారంగా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేయాలని, సిబ్బంది కొరత నివారణకు ఇతర శాఖల నుంచి అర్హులైన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి నియమించాలని సూచించారు. 

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో తూనికలు కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా ఆహార నాణ్యతపై అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సన్న రకం ధాన్యం సాగుపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nadendla Manohar
Andhra Pradesh
Market Prices
Essential Commodities
Payyavula Keshav
Achchennaidu
Satya Kumar Yadav
Price Monitoring
Food Safety

More Telugu News