YS Sharmila: అందరూ వద్దంటున్న ఆ లింక్ ప్రాజెక్టుపై చంద్రబాబుకు అంత ప్రేమెందుకో!: షర్మిల

YS Sharmila Slams Chandrababu Over Banakacherla Project
  • బనకచర్ల ప్రాజెక్టు విషయంలో షర్మిల విమర్శలు
  • బనకచర్ల ప్రాజెక్టు ఓ గుదిబండ అని వ్యాఖ్యలు
  • అర్థంపర్థంలేని ప్రాజెక్టులు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని వెల్లడి
బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చంద్రబాబుకు అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదంటూ సోషల్ మీడియాలో స్పందించారు. ఆ ప్రతిపాదన పనికిరాదని రాయలసీమ ప్రొఫెసర్లు చెబుతున్నారు... రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు మొత్తుకుంటున్నారు... కాంట్రాక్టర్ కు తప్ప ఏపీకి ఏమాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఢిల్లీ చుట్టూ అంత ఆత్రంగా ఎందుకు తిరుగుతున్నట్టు అని షర్మిల ప్రశ్నించారు. 

"బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరుపెడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నా చంద్రబాబు గారికి ఎందుకు అర్ధం కావడం లేదు? మీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఎత్తు తగ్గించారా? ఏ నీళ్ల కోసం బనకచర్ల లింక్ ప్రతిపాదన చేశారని గోదావరి అథారిటీ అడిగిన దానికి మీ సమాధానం ఎక్కడ? రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నీళ్ల గురించి ఆలోచన చేయకుండా, ముక్కు ఎక్కడంటే తలచుట్టూ తిప్పినట్లుగా గోదావరి నుంచి తెస్తామనడం ఎవరిని మోసం చేయడానికి? 

2014 నాటికి మహానేత వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు 39కి పైనే. ఈ 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తట్టెడు మట్టి కూడా తియ్యలేదనేది కళ్ళకు కట్టిన వాస్తవం. పెండింగ్ ప్రాజెక్టులకు సుమారు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 50 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు, కోటి మంది జనాభాకు తాగునీరు అందుతుందని తెలిసినా... ఇప్పటి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరం. పోలవరంతో సహా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేస్తే బనకచర్ల అవసరం లేదని తెలిసి చంద్రబాబు గారు అనుమతుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటే ఇది అవినీతికి వ్యూహం కాకపోతే మరేమిటి? 

ఇక బీజేపీ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి గారు పోలవరం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. వైఎస్సార్ కొడుకై ఉండి 5 ఏళ్లలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా? మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 2022లో పోలవరం నీటి నిల్వ సామర్ధ్యం 41.15 మీటర్ల కుదించిన పాపం ఆనాటి మీ ప్రభుత్వంది కాదా? అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చూసింది మీరు కాదా? ప్రాజెక్ట్ ఎత్తు కుదింపు పాపం ముమ్మాటికి జగన్ గారిదే. బీజేపీకి అమ్ముడుపోయి మోదీ కోసం పోలవరం ప్రయోజనాలను తాకట్టు పెట్టి... ఇప్పుడు ఎత్తు పెంచాలని మాట్లాడుతున్న మాటలు బీద ఏడుపులు తప్ప మరోటి కాదు. 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకోవడం రాష్ట్ర హక్కు... ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ పెండింగ్ ప్రాజెక్టులకు పక్కన పెట్టి, మీ స్వార్థ ప్రయోజనాల కోసం అర్థం పర్ధం లేని ప్రాజెక్టులు కడతాం అంటే చూస్తూ ఊరుకొనేది లేదు. వెంటనే బనకచర్ల ప్రయత్నాలు ఆపండి. ముందు పోలవరం సంగతి తేల్చండి. పాత డీపీఆర్ ప్రకారమే పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగేలా చూడండి. పెండింగ్ లో ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయండి" అంటూ షర్మిల స్పష్టం చేశారు.
YS Sharmila
YS Sharmila criticism
Chandrababu Naidu
Polavaram project
Banakacherla project
Andhra Pradesh Congress
Jal Yagnam projects
AP politics
irrigation projects
Jagan Mohan Reddy

More Telugu News