Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు గుప్పించిన బ్రియాన్ లారా

Brian Lara Criticizes West Indies Cricket Board
  • పూరన్ లాంటి ఆటగాళ్లు చాలా త్వరగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నారన్న లారా
  • ఈ విషయంలో బోర్డుదే తప్పని విమర్శ
  • ఆటగాళ్లు దేశానికి ఆడేలా బోర్డు చర్యలు తీసుకోవడం లేదన్న లారా
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అసంతృప్తి వ్యక్తం చేశారు. నికోలస్ పూరన్ వంటి ఆటగాళ్లు చాలా త్వరగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని.... లీగ్ క్రికెట్ లో పాల్గొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకోవడమే దీనికి కారణమని ఆయన అన్నారు. ఈ విషయంలో క్రికెట్ బోర్డుదే తప్పని... ప్రతిభ కలిగిన ఆటగాళ్లను దేశం కోసం ఆడేలా చేయడంలో బోర్డు పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులను చూసైనా నేర్చుకోవాలని అన్నారు.

తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే ఆటగాళ్లు చాలా మంది ఉంటారని... వీరిలో నికోలస్ పూరన్ లాంటి ట్యాలెంటెడ్ ప్లేయర్లు కూడా ఉంటారని లారా చెప్పారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే పూరన్ రిటైర్మెంట్ తీసుకున్నాడని... ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐదు, ఆరు లీగ్ లు ఉన్నాయని... ఇవి తమ ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నాయని చెప్పారు. ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగేందుకు విండీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తమ కుటుంబాల కోసమే క్రికెటర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా బోర్డు మేల్కొనాలని హితవు పలికారు.
Brian Lara
West Indies Cricket
Nicholas Pooran
Cricket Board
T20 Leagues
Player Retirement
West Indies Team
Cricket Administration
Cricket News
International Cricket

More Telugu News