Satyajit Ray: ఆ ఇల్లు సత్యజిత్ రేది కాదు.. బంగ్లాదేశ్ ప్రభుత్వం

Satyajit Ray House Not His Bangladesh Government Clarifies
  • రే పూర్వీకులకు, కూల్చివేస్తున్న ఇంటికి సంబంధం లేదన్న బంగ్లాదేశ్ అధికారులు
  • రే ఇల్లు నిక్షేపంలా ఉందని వివరణ
  • కూల్చివేస్తున్న ఇల్లు గతంలో చిల్డ్రన్స్ అకాడమీ అని వివరణ
బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌ జిల్లాలో కూల్చివేస్తున్న ఇల్లు ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రేది కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దానిని దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే వంశానికి చెందినదిగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన జిల్లా సీనియర్ అధికారి ఒకరు స్పష్టతనిచ్చారు. కూల్చివేసిన ఈ భవనానికి, సత్యజిత్ రే పూర్వీకులకు ఎలాంటి సంబంధం లేదని మైమెన్‌సింగ్ డిప్యూటీ కమిషనర్ మోఫిదుల్ ఆలం తెలిపారు. ఈ ఇంటికి సంబంధించిన పత్రాలను తాము తనిఖీ చేశామని, కూల్చివేస్తున్న ఈ ఇల్లు గతంలో మైమెన్‌సింగ్ చిల్డ్రన్స్ అకాడమీ కార్యాలయంగా ఉండేదని, సత్యజిత్ రే పూర్వీకులతో దీనికి సంబంధాలున్నాయని చెప్పేందుకు ఎలాంటి రికార్డులు లేవని ఆయన వివరించారు. 

"రే పూర్వీకుల ఆస్తి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని మేము నిర్ధారించుకున్నాం. మేము దాని ప్రస్తుత యజమానితో మాట్లాడాం. అతను ఆ ఆస్తిని రే కుటుంబం నుంచి నేరుగా కొనుగోలు చేశాడని, దానిని నిరూపించడానికి పత్రాలు తన వద్ద ఉన్నాయని ధ్రువీకరించాడు. కూల్చివేయబడుతున్న ఇంటి పక్కనే ఉన్న భవనాన్ని రే పూర్వీకుల ఇల్లుగా తప్పుగా గుర్తిస్తున్నారు" అని ఆలం పేర్కొన్నారు.    

సత్యజిత్ రే తాత, ప్రముఖ రచయిత, ప్రచురణకర్త ఉపేంద్ర కిషోర్ రే చౌదరి నిర్మించిన శతాబ్దపు పురాతన నిర్మాణాన్ని కూల్చివేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఒకప్పుడు మైమెన్సింగ్ శిశు అకాడమీకి నిలయంగా ఉన్న ఈ భవనం దశాబ్ద కాలంపాటు వదిలివేశారు.

‘‘ఆ ఇంటిని పదేళ్లుగా వదిలివేశారు. శిశు అకాడమీ కార్యకలాపాలు అద్దె భవనం నుంచి కొనసాగుతున్నాయి’’అని జిల్లా బాలల వ్యవహారాల అధికారి ఎండీ మెహెదీ జమాన్ పేర్కొన్నారు. ఈ గందరగోళానికి అపార్థమే కారణమని, రే పూర్వీకుల ఇల్లు రక్షణలోనే ఉందని ఆయన వివరించారు.

ప్రపంచ సినిమాలో ఒక మహోన్నత వ్యక్తి అయిన సత్యజిత్ రే.. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ అందుకున్నారు. అలాగే, చిత్రనిర్మాణానికి ఆయన చేసిన కృషికి గాను అకాడమీ అవార్డు అందుకున్నారు.
Satyajit Ray
Bangladesh
Mymensingh
Childrens Academy
Upendra Kishore Ray Chowdhury
Ray family property
Film director
Indian cinema
Bangladesh government

More Telugu News