Alaska Earthquake: అలాస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

73 Magnitude Earthquake Hits US Alaska Tsunami Warning Issued
  • అమెరికాలోని అలాస్కా తీరంలో నిన్న‌ 7.3 తీవ్రతతో భూకంపం
  • శాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
  • దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి సునామీ హెచ్చరికలు జారీ
అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాల‌మానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉంద‌ని అలాస్కాలోని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 

"దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణాన) నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు NE) వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేయబడింది" అని కేంద్రం తెలిపింది.

కాగా, 1964 మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం 9.2 తీవ్రతతో భూకంపం బారిన పడింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. అలాగే అది ఆంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది. అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలను ముంచెత్తి సునామీని సృష్టించింది. భూకంపం, సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.
Alaska Earthquake
Alaska
Earthquake
Tsunami warning
USGS
Sand Point
Pacific coast
Kenney Entrance
Unimak Pass

More Telugu News