KTR: 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయింది: రేవంత్ రెడ్డి-చంద్రబాబు భేటీపై కేటీఆర్

KTR Slams Revanth Reddy Chandrababu Meeting in Delhi
  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
  • ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయిందని కేటీఆర్ ట్వీట్
  • తెలంగాణ వ్యతిరేకిని గెలిపించినందుకు ప్రజలకు బూడిద మిగులుతోందని హెచ్చరిక
  • కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేలిపోయిందన్న కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. "ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయింది.. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయింది" అంటూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

"తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి... బూడిద తెలంగాణ ప్రజలకి!" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇరు రాష్ట్రాల సమావేశంలో బనకచర్ల గురించి చర్చకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుకాయించారని ఆరోపించారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పటం కోసమే రేవంత్ రెడ్డి గద్దెనెక్కారా? అని నిలదీశారు. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో ఈరోజుతో తేలిపోయింది. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపేయి. అప్పుడు తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో! జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో!" అని రాసుకొచ్చారు.

ఒక్క మాట గుర్తు పెట్టుకో... ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావని హెచ్చరించారు. "ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పక పడతాం!" అని హెచ్చరించారు.
KTR
Revanth Reddy
Chandrababu Naidu
Telangana
Andhra Pradesh
Rahul Gandhi

More Telugu News