Ashwini Vaishnaw: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం

Ashwini Vaishnaw Announces Key Central Cabinet Decisions
  • 'పీఎం ధన్ ధాన్య కృషి యోజన'కు మంత్రివర్గం ఆమోదం
  • శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం
  • మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 'పీఎం ధన్ ధాన్య కృషి యోజన' పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు.

వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత గ్రామస్థాయిల్లో దిగుబడులను నిల్వ చేయడానికి గోదాముల సదుపాయం, నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని రూపొందించారు. 11 శాఖల్లోని 36 పథకాలు, రాష్ట్రంలోని ఇతర పథకాలు, ప్రైవేటు రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీకి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం చేశారు.
Ashwini Vaishnaw
PM Dhan Dhanya Krishi Yojana
Central Cabinet Decisions
Agriculture Development Scheme

More Telugu News