Narayana Murthy: నరేంద్ర మోదీ మాత్రమే 100 గంటలు పని చేస్తారు: విమానంలో ఎంపీ తేజస్వీ సూర్యతో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి!

Narayana Murthy says only Narendra Modi works 100 hours MP Tejasvi Surya
  • ముంబై నుంచి బెంగళూరుకు నారాయణమూర్తితో కలిసి ప్రయాణించానన్న తేజస్వీ సూర్య
  • రెండు గంటల పాటు స్ఫూర్తిదాయకమైన సంభాషణ జరిగిందని వ్యాఖ్య
  • నారాయణమూర్తి చెప్పిన 'వారానికి 70 గంటలు పని' లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నానన్న ఎంపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించారు. ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో నారాయణమూర్తితో కలిసి ప్రయాణించినట్లు ఆయన తెలిపారు.

రెండు గంటల ఈ ప్రయాణంలో తమ మధ్య ఎంతో స్ఫూర్తిదాయకమైన సంభాషణ జరిగిందని ఆయన అన్నారు. భారత ఐటీ సేవల రంగానికి నారాయణమూర్తి మార్గదర్శకత్వం వహించి, దానిని ప్రపంచ శక్తి కేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇన్ఫోసిస్ లక్షలాది మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణమవుతోందని అన్నారు. తమ మధ్య ఏఐ (కృత్రిమ మేధ), నైతిక విలువలు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు.

గతంలో వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తాను నారాయణమూర్తితో చెప్పానని తేజస్వీ సూర్య పేర్కొన్నారు. దానికి ఆయన స్పందిస్తూ, నరేంద్ర మోదీ మాత్రమే వారానికి 100 గంటలు పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని నారాయణమూర్తి ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Narayana Murthy
Narendra Modi
Tejasvi Surya
Infosys
Indian IT Sector
70 hour work week

More Telugu News