Online Trading Fraud: వృద్ధురాలిని నమ్మించి రూ.57.43 లక్షలు కాజేశారు.. హైదరాబాద్ లో ఘరానా మోసం

Online Trading Fraud Hyderabad Woman Loses 57 Lakhs
  • అధిక లాభాలు పొందొచ్చంటూ ఇన్ స్టాలో వల
  • తొలుత భారీగా లాభాలు చూపించి నమ్మించిన వైనం
  • భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టగానే మొత్తం ఊడ్చేసిన సైబర్ మోసగాళ్లు
ఆన్ లైన్ ట్రేడింగ్ లో భారీగా లాభాలు పొందవచ్చంటూ ఇన్ స్టాలో వల విసిరారు.. నమ్మి పెట్టుబడులు పెట్టిన ఓ వృద్ధురాలికి తొలుత భారీగా లాభాలు ముట్టజెప్పారు. ఆపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించి రూ.57.43 లక్షలు కాజేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుందీ ఘరానా మోసం. మోసగాళ్ల బారిన పడినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘరానా మోసం వివరాలు.. జూబ్లీహిల్స్‌ కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎఫ్‌ఎక్స్‌ రోడ్‌ పేరుతో ప్రకటన కనిపించింది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కు సంబంధించిన ఈ ప్రకటనలో అధిక లాభాలు పొందవచ్చని మోసగాళ్లు వలవిసిరారు. 

బాధిత వృద్ధురాలు ఆ ప్రకటనలోని లింక్‌ను క్లిక్‌ చేయగా.. గుర్తుతెలియని వ్యక్తులు వెంటనే లైన్‌లోకి వచ్చారు. తమ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించారు. మీ పెట్టుబడికి ఊహకందని లాభాలు కళ్లజూస్తారని ఊరించారు. పెద్ద పెద్ద కంపెనీల ట్రేడింగ్‌ జరుగుతుందని నమ్మించి బ్యాంకుల నుంచి, క్రెడిట్‌ కార్డు నుంచి రకరకాలుగా పెట్టుబడులు పెట్టించారు. బాధితురాలికి నమ్మకం కలిగించేందుకు తొలుత మంచి లాభాలు చూపించారు. వాటిని విత్ డ్రా చేసుకునే వీలు కల్పించారు. దీంతో బాధితురాలు పూర్తిగా నమ్మి విడతలవారీగా రూ.57.43 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత లాభాలు గానీ, విత్‌డ్రా గానీ చేసుకునే అవకాశం కల్పించలేదు. ఇదేంటని ప్రశ్నించిన వృద్ధురాలిని బెదిరించారు. మరిన్ని పెట్టుబడులు పెడితే తప్ప ఇప్పటి వరకు పెట్టిన సొమ్ము రాదని చెప్పారు. దీంతో బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Online Trading Fraud
Hyderabad Cyber Crime
Cyber Fraud
Jubilee Hills
Instagram Fraud
FX Road
Online Investment Scam
Elderly Woman Fraud

More Telugu News