England: మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్‌కు ఊహించ‌ని షాక్‌!

Ben Stokes England Fined and Loses WTC Points After Third Test Win
  • స్లో ఓవర్ రేట్ కార‌ణంగా ఆతిథ్య జ‌ట్టుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్‌
  • డ‌బ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్‌లో రెండు పాయింట్లు కోత‌
  • ఈ మేర‌కు ఐసీసీ నుంచి వెలువ‌డిన‌ ప్రకటన
లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్ట్‌లో భారత్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. స్లో ఓవర్ రేట్ కార‌ణంగా ఆతిథ్య జ‌ట్టుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా ఎదుర్కొవ‌డంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) పాయింట్ల టేబుల్‌లో రెండు పాయింట్లు కోల్పోయింది. 

ఈ మేర‌కు ఐసీసీ నుంచి ఒక ప్రకటన వెలువ‌డింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గేమ్ రూల్స్‌లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఈ జ‌రిమానాతో పాటు పాయింట్ల కోత విధించబడింది. ఫ‌లితంగా ఇంగ్లండ్ మూడో స్థానానికి ప‌డిపోయింది. వారి పాయింట్ల శాతం 66.67 శాతం నుంచి 61.11 శాతానికి తగ్గింది.

ఇంగ్లండ్‌ను అధిగ‌మించి శ్రీలంక ఇప్పుడు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టేబుల్ టాపర్ ఆస్ట్రేలియా కంటే కొంచెం వెనుకబడి ఉంది. ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇంగ్లండ్ పై 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడిందని ఐసీసీ తెలిపింది.

కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నేరాన్ని అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విధించిన ప్రతిపాదిత శిక్షను కూడా అంగీకరించాడు.

"దీని కారణంగా అధికారిక విచారణ అవసరం లేదు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, థర్డ్ అంపైర్ అహ్సాన్ రజా, నాలుగో అంపైర్ గ్రాహం లాయిడ్ ఈ అభియోగాలను మోపారు" అని ఐసీసీ పేర్కొంది.

ఇదిలాఉంటే... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్ర‌స్తుతం ఆతిథ్య జ‌ట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ నెల‌ 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.


England
Ben Stokes
England Cricket
ICC
World Test Championship
WTC Points Table
Slow Over Rate
Cricket Fine
Australia Cricket
Sri Lanka Cricket
England vs India

More Telugu News