Indian American woman: టార్గెట్ స్టోర్ లో చోరీ యత్నం.. అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్ట్

Indian American Woman Arrested for Shoplifting at Target Store
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • డబ్బులు చెల్లిస్తా తనను అరెస్టు చేయొద్దంటూ ప్రాధేయపడ్డ మహిళ
  • భారత్ లో అలా జరుగుతుందేమో కానీ ఇక్కడ అలా కుదరదన్న పోలీసులు
  • దేశం పరువు తీసిందంటూ మండిపడుతున్న నెటిజన్లు
అమెరికాలోని ప్రముఖ షాపింగ్ మాల్ ‘టార్గెట్’ లో చోరీ ఆరోపణలతో భారత సంతతి మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గంటల తరబడి స్టోర్ లో పచార్లు చేసిన సదరు మహిళ.. చివరకు డబ్బులు చెల్లించకుండా వస్తువులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని స్టోర్ సిబ్బంది ఆరోపించారు. దీంతో ఆమెను నిర్భంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సదరు మహిళ తాను డబ్బులు చెల్లిస్తానని, అరెస్టు చేయొద్దని ప్రాధేయపడింది. అయితే, భారత్ లో అలా జరుగుతుందేమో కానీ ఇది అమెరికా, ఇక్కడ అలాంటివేమీ కుదరవని మహిళా పోలీసు అధికారి స్పష్టం చేశారు.

దొంగతనం చేయడమే కాదు, చేసేందుకు ప్రయత్నించడం కూడా ఇక్కడ నేరమేనని తేల్చిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దేశంకాని దేశంలో ఉంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, స్థానిక చట్టాలపై అవగాహనతో మసలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనతో భారత్ కు తలవంపులు తెచ్చారంటూ సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రకారం.. భారత సంతతికి చెందిన ఓ మహిళ ఇల్లినాయిస్ రాష్ట్రంలోని టార్గెట్ స్టోర్ లో అనుమానాస్పదంగా తిరగడం సిబ్బంది గమనించారు. సుమారు ఏడు గంటలుగా ఆమె స్టోర్ లోనే అటూఇటూ తిరిగింది. పలు వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు నటించింది. కార్ట్ లో 1300 డాలర్ల విలువైన సామాన్లతో పాటు బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది పట్టుకున్నారు.

ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రావడంతో ఆ మహిళ ప్రాధేయపడడం ప్రారంభించింది. తనది ఈ దేశం కాదని, తాను ఇక్కడ ఉండబోవడం లేదని చెప్పింది. తాను దొంగతనం చేయడానికి ప్రయత్నించిన వస్తువులకు డబ్బు చెల్లిస్తానని, తనను స్టేషన్ కు తీసుకెళ్లవద్దని రిక్వెస్ట్ చేసింది. అయితే, పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడిన నేరానికి ఆమెకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Indian American woman
Target store
shoplifting
Illinois
United States
crime
arrest
theft

More Telugu News