Shubman Gill: లార్డ్స్‌లో శుభ్‌మన్ గిల్ వైఖరి వల్లే ఓటమి.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Shubman Gills Attitude Led to Loss Says Former Cricketer
  • లార్డ్స్‌లో 22 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు
  • బెన్‌స్టోక్స్‌ను గిల్ రెచ్చగొట్టాడన్న మహ్మద్ కైఫ్
  • దీనికితోడు అతడి పేలవ ప్రదర్శన కూడా జట్టును దెబ్బతీసిందన్న మాజీ క్రికెటర్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోవడానికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైఖరే కారణమని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో గిల్, ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీతో జరిపిన వాగ్వాదం ఇంగ్లండ్ జట్టును ఉత్తేజపరిచి, కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేయడానికి ప్రేరేపించిందని కైఫ్ అభిప్రాయపడ్డారు.

మూడో రోజు చివరి గంటల్లో జాక్ క్రాలీ సమయం వృథా చేస్తున్నాడని గిల్ అన్నాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. గిల్ క్రాలీని ఉద్దేశించి ‘ధైర్యం చూపించు’ అన్నాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఈ ఘటన ఇంగ్లండ్ జట్టును మరింత ఉత్సాహపరిచిందని, స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడని కైఫ్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. "శుభ్‌మన్ గిల్, జాక్ క్రాలీతో జరిగిన వివాదం ఇంగ్లండ్‌ను ఉత్తేజపరిచింది. ఈ ఘటన స్టోక్స్‌ను రెచ్చగొట్టి, అతను అద్భుతమైన స్పెల్ వేయడానికి కారణమైంది. తమకు సరిపడే వైఖరిని అలవర్చుకోవడం తెలివైన పని. గిల్ ఇంకా నేర్చుకుంటాడు" అని కైఫ్ రాసుకొచ్చాడు.

గిల్ ఈ సిరీస్‌లో లీడ్స్‌లో సెంచరీ, బర్మింగ్‌హామ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ 23 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఇంగ్లండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు (607, యావరేజ్ 101.17) సాధించిన భారత ఆటగాడిగా గిల్ రికార్డులకెక్కాడు. అయినప్పటికీ, లార్డ్స్‌లో అతడి పేలవ ప్రదర్శన, క్రాలీతో జరిగిన వివాదం జట్టు ఓటమికి దారితీసినట్టు విమర్శలు వచ్చాయి.

గిల్ మాట్లాడుతూ.. "మా టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్కోరు చేయలేకపోయారు. ఒక మంచి ఫిఫ్టీ పార్ట్‌నర్‌షిప్ ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, జడ్డూ భాయ్, సిరాజ్ చూపించిన పోరాటం అద్భుతం" అని చెప్పాడు. ఈ ఓటమితో భారత్ సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. ఈ నెల 23న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.
Shubman Gill
India vs England
India England Test Series
Zak Crawley
Mohammad Kaif
Ben Stokes
Lords Test Match
Cricket Controversy
Indian Cricket Team
Test Cricket

More Telugu News