Donald Trump: ఆయుధాలు ఇస్తే నువ్వు నేరుగా మాస్కోపై దాడి చేయగలవా?: జెలెన్ స్కీని అడిగిన ట్రంప్!

Donald Trump asked Zelensky about attacking Moscow
ఇటీవల ట్రంప్-పుతిన్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ
ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పుతిన్!
అనంతరం జెలెన్ స్కీతో ట్రంప్ కీలక చర్చలు!
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా శాంతి మంత్రం జపించిన ట్రంప్... ఇకపై రష్యాను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. జులై 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణలో, అవసరమైన ఆయుధాలు అందిస్తే మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లతో సహా రష్యా లోపల దాడులను తీవ్రతరం చేయగలరా? అని ట్రంప్ ప్రశ్నించినట్లు ఓ కథనం వచ్చింది.

ఆ కథనం ప్రకారం... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్‌ ఫోన్ కాల్ సంభాషణ తీవ్ర నిరాశాజనకంగా ముగిసిన తర్వాత జెలెన్ స్కీతో ఈ చర్చ జరిగింది. కాల్పుల విరమణ చర్చలకు రష్యా నిరాకరించడంపై అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది సూచిస్తోంది. రష్యాను నేరుగా ఎదుర్కోవడానికి వెనుకడుగు వేస్తారన్న ట్రంప్ మునుపటి అభిప్రాయానికి ఇది భిన్నమైన వైఖరిగా భావిస్తున్నారు. రష్యన్లకు ఏదో విధంగా బాధ కలిగించి, వారిని చర్చలకు రప్పించడమే ట్రంప్ కొత్త వ్యూహమని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అమెరికా దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియకపోయినా, రష్యా భూభాగంపై మరింత దూకుడు దాడులకు పాశ్చాత్య దేశాలు, మరియు అమెరికా విధాన రూపకర్తలలో మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు కొత్త ఆయుధాలను అందిస్తామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించడం, అలాగే 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా ఎగుమతుల కొనుగోలుదారులపై ఆంక్షలు విధిస్తామని బెదిరించడం వంటి పరిణామాలు మాస్కో మొండి వైఖరి కారణంగానే చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Donald Trump
Ukraine Russia war
Volodymyr Zelensky
Russia
Moscow
Saint Petersburg
US foreign policy
military aid
peace talks
Ukraine

More Telugu News