Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ వాదన గట్టిగా వినిపించాలి!: బండి సంజయ్

Bandi Sanjay urges Revanth Reddy to voice Telangana concerns in CM meeting
  • తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదన్న బండి సంజయ్
  • కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమేనని వ్యాఖ్య
  • ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరగనున్న సమావేశంలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపు వచ్చింది. రేపు ఈ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయదని ఆయన అన్నారు. కేంద్రానికి రెండు రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని ముఖ్యమంత్రి వివరించాలని సూచించారు. కరీంనగర్‌లో పర్యటించిన బండి సంజయ్ మాట్లాడుతూ, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో బీసీలు 51 శాతమని తేలితే, కాంగ్రెస్ సర్వేలో మాత్రం 46 శాతంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు.

బీసీలలో ముస్లింలను కలపడం సరికాదని ఆయన అన్నారు. బీసీ ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకించబోమని, కానీ బీసీల్లో ముస్లింలను కలిపితే మాత్రం అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలుపుతూ అన్యాయం చేస్తోందని, బీసీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.
Bandi Sanjay
Revanth Reddy
Chandrababu Naidu
Telangana
Andhra Pradesh
Telugu States

More Telugu News