Nimisha Priya: నిమిషకు తాత్కాలిక ఉరట.. మరణశిక్ష వాయిదా వేసిన యెమెన్

Nimisha Priya Death Sentence Postponed in Yemen
  • రేపు అమలు చేయాల్సిన మరణశిక్షను వాయిదా వేసిన యెమెన్
  • నిమిష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తోందన్న విదేశాంగ శాఖ
  • పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం
నిమిష ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. తనను వేధిస్తున్న వ్యక్తిని హత్య చేసినందుకు గాను కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్ అధికారులు ఉరిశిక్ష విధించారు. రేపు ఈ శిక్షను అమలు చేయాల్సి ఉండగా, భారత అధికారులు యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరణశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.

నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపడానికి భారత ప్రభుత్వం తన పరిధిలో సంప్రదింపులు జరిపింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం నిమిష కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. మృతుడి కుటుంబంతో నిమిష ప్రియ కుటుంబం చర్చల కోసం మరింత గడువు కావాలని భారత్ బలంగా కోరింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మరణశిక్ష అమలు వాయిదా పడింది.

ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిష ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. నిమిష కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మరణశిక్ష వాయిదా పడినట్లు పేర్కొంది.
Nimisha Priya
Yemen
Death Sentence
Kerala Nurse
Murder Case
Indian Government

More Telugu News