Talasani Srinivas Yadav: బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav Reacts on BC Reservations Issue
  • రాష్ట్రంలో బీసీలను విడదీసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపాటు
  • బీసీలు ఏకతాటి పైకి రావాలని పిలుపు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ రిజర్వేషన్ అంశంపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నాకు హాజరైన తలసాని మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలను విడదీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. సాధ్యం కాని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు.

బీసీలు తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు.

బీసీ రిజర్వేషన్లపై గతంలో పలువురు ముఖ్యమంత్రులు తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. కానీ రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పెడితే తప్ప అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై అప్పుడే అంతా అయిపోయినట్లుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సన్మానం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Talasani Srinivas Yadav
BRS
BC Reservations
Telangana
Revanth Reddy
Congress

More Telugu News