Dhanashree Verma: ‘బిగ్‌బాస్ 19’లో యుజ్వేంద్రచాహల్ మాజీ భార్య ధనశ్రీవర్మ

Dhanashree Verma to Appear in Bigg Boss 19
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న చాహల్, ధనశ్రీవర్మ
  • ఈ ఏడాది విడాకులు తీసుకున్న వైనం
  • బిగ్‌బాస్ 19 కోసం ధనశ్రీని సంప్రదించిన టీం
  • ఈ ఏడాది అత్యంత ఎక్కువ కాలం నడిచే సీజన్‌గా రికార్డు సృష్టించనున్న బిగ్‌బాస్ షో
  • బిగ్‌బాస్ 19లో ఇండియన్ ఐడల్ ఫేం శ్రీరామచంద్ర కూడా
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ ‘బిగ్‌బాస్ 19’లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనాల్సిందిగా బిగ్‌బాస్ టీం ఆమెను సంప్రదించినట్టు సమాచారం. ‘బిగ్ బాస్’కు సంబంధించిన ఒక ఇన్‌సైడర్ పేజీలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. ధనశ్రీ వర్మ ‘బిగ్ బాస్ 19’లో పాల్గొనడం దాదాపు నిశ్చయమైనట్టు తెలుస్తోంది. గతంలో ఆమె ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ కోసం కూడా ఎంపికైంది, కానీ ఆ షో రద్దయింది. ఇప్పుడు ధనశ్రీ ‘బిగ్ బాస్’ ఆఫర్‌ను అంగీకరించినట్టు సమాచారం. 

ఈ షోలో ధనశ్రీతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ‘ఇండియన్ ఐడల్ 5’ ఫేమ్ గాయకుడు-నటుడు శ్రీరామ చంద్ర కూడా ఉన్నారు. ‘బిగ్ బాస్ 19’ ఈ ఏడాది అత్యంత ఎక్కువ కాలం నడిచే సీజన్‌గా రికార్డు సృష్టించనుందని, ఆగస్టు చివరి వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ధనశ్రీ వర్మ, చాహల్ 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. 2023లో వారి బంధంలో సమస్యలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకరి ఫొటోలను మరొకరు తొలగించడం, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం వంటి చర్యలతో విడాకుల ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2025 మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు వారి విడాకులను ఆమోదించింది.

ధనశ్రీ ఇటీవల రాజ్‌కుమార్ రావు, వామిఖా గబ్బీ నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ చిత్రంలోని ‘టింగ్ లింగ్ సజ్నా’ అనే గీతంలో కనిపించింది. ‘బిగ్ బాస్ 19’లో ఆమె పాల్గొనడం ద్వారా షోకు అదనపు ఆకర్షణ వస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు.
Dhanashree Verma
Yuzvendra Chahal
Bigg Boss 19
Indian Idol Sreerama Chandra
Khatron Ke Khiladi
Bollywood
Divorce
Reality Show
Mumbai Family Court
Bhool Chuk Maaf

More Telugu News