S Jaishankar: అందుకు చైనాకు కృతజ్ఞతలు: భారత్-చైనా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

S Jaishankar Thanks China for Cooperation on India and China Relations
  • మోదీ, జిన్ పింగ్ భేటీ తర్వాత సంబంధాలు పుంజుకున్నాయన్న జైశంకర్
  • విభేదాలు వివాదాలుగా మారకూడదన్న జైశంకర్
  • భారత్, చైనా సంబంధాలు ప్రపంచానికి మేలు చేస్తాయన్న జైశంకర్
భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన తర్వాత నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పుంజుకుంటున్నాయని అన్నారు. విభేదాలు ఎప్పుడూ వివాదాలుగా మారకూడదని, అలాగే పోటీ.. సంఘర్షణగా మారకూడదని ఆయన అన్నారు.

చైనా పర్యటనలో ఉన్న జైశంకర్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టియాంజిన్ వేదికగా మంగళవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోవాలని, మంచి ఫలితాలు రావాలని కోరుకున్నట్లు చెప్పారు.

ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, దూరదృష్టితో ఆలోచించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్టోబర్ 2024లో మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారని, నాటి నుంచి సంబంధాలు సానుకూల దిశలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. రెండు దేశాలు కూడా బాధ్యతాయుతంగా కొనసాగించాలని వ్యాఖ్యానించారు. క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకుంటే రెండు దేశాలకు మేలు జరుగుతుందని అన్నారు.

ఐదేళ్ల విరామం అనంతరం మానససరోవర్ యాత్ర పునఃప్రారంభమైందని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇందుకు చైనాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతుందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గత తొమ్మిది నెలల్లో కీలక పురోగతి సాధించామని, సరిహద్దు వెంబడి ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకున్నామని ఆయన అన్నారు.

ఆర్థికంగా రెండు బలమైన దేశాలు కలిసి ముందుకు వెళితే త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని జైశంకర్ అన్నారు. భారత్, చైనా సంబంధాలు ప్రపంచానికి కూడా మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. రేపు జరగనున్న సమావేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం తదితర అంశాలపై చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే కృత నిశ్చయంతో భారత్ ఉందని జైశంకర్ అన్నారు. విదేశాంగ మంత్రిగా ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత వాంగ్ యీపై ఉందని అన్నారు.
S Jaishankar
India China relations
Wang Yi
Narendra Modi
Xi Jinping
bilateral relations

More Telugu News