Turaka Kishore: వైసీపీ నేత తురకా కిశోర్‌పై మరో కేసు

Turaka Kishore Faces Another Case Filed
  • తురకా కిశోర్‌పై ఇప్పటికే ఏడు హత్యాయత్నం కేసులు, మరో ఏడు ఇతర కేసులు
  • ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో తురకా కిశోర్ ను అరెస్టు చేసిన పోలీసులు
  • నెల రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.

పార్టీ మారడం లేదన్న కారణంతో టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై 2022 అక్టోబర్ 7న తురకా కిశోర్, బోదిలవీడుకు చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబు మరికొందరు దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డారు. అయితే దీనిపై నాడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

తాజాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ దారపనేని శ్రీనివాసరావు ఆదివారం మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తురకా కిశోర్‌తో పాటు ఇతర నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సమందర్ వలీ తెలిపారు.

కాగా, ఇప్పటికే తురకా కిశోర్‌పై ఏడు హత్యాయత్నం కేసులు, మరో ఏడు ఇతర కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన తురకా కిశోర్, బెంగళూరులోని తన సోదరుడు వద్ద ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వచ్చిన సందర్భంలో ఏపీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జైలుకు తరలించారు. మరోవైపు నెల రోజుల క్రితమే ఆయనను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
Turaka Kishore
YSRCP
Pinnelli Ramakrishna Reddy
Andhra Pradesh Politics
Attempt to Murder Case
Veludurthi Police Station
Dharapaneni Srinivasa Rao
Palnadu District
Political Crime

More Telugu News