Kota Srinivasa Rao: మేటి నటుడికి కడసారి వీడ్కోలు... జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన కోట అంత్యక్రియలు

Kota Srinivasa Rao Last Rites Held in Hyderabad
  • ఈ ఉదయం కన్నుమూసిన కోట శ్రీనివాసరావు
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • కోటకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్ద మనవడు శ్రీనివాస్
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారి అంత్యక్రియలు ముగిశాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం (జూలై 13) ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.

సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగింది. వందలాది మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు కడసారి నివాళులర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, వెంకటేశ్, రానా దగ్గుబాటి వంటి పలువురు సినీ ప్రముఖులు కోట శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. చిరంజీవి ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే సినిమాతో (ప్రాణం ఖరీదు, 1978) తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితర రాజకీయ ప్రముఖులు కూడా ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

కోట శ్రీనివాసరావు తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన విలక్షణమైన నటనకు, ముక్కుసూటి వ్యక్తిత్వానికి పేరుగాంచారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న కోట శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Kota Srinivasa Rao
Telugu actor
Tollywood
Chiranjeevi
Prakash Raj
Venkatesh
Rana Daggubati
Film Nagar
Mahaprasthanam
Telugu cinema

More Telugu News