Kollu Ravindra: వైసీపీ నాయకుల్లో ఒక మహానటి ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Slams YSRCP Leaderships Actions
  • కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్
  • వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • అడ్డంగా బుక్ అయిపోయారని వ్యాఖ్యలు
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి పైశాచిక రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల్లో ఒక మహానటి ఉందన్నారు.

కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ వివాదంమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కారును టీడీపీ నాయకులు వదిలేశారని, అయితే ఆమె కావాలనే తిరిగి వచ్చి పోలీసులను, టీడీపీ నాయకులను దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ సంఘటనను టీడీపీ నాయకత్వానికి అంటగట్టి, రాష్ట్రవ్యాప్తంగా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నంలో వైసీపీ విఫలమైందని ఆయన తెలిపారు. రాష్ట్రమంతా భగ్గుమనిపించాలని చూసి అడ్డంగా బుక్ అయిపోయారు... ఈ కుట్రల వెనుక వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

వైసీపీ రాక్షస రాజకీయాలు
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని కొల్లు రవీంద్ర విమర్శించారు. "వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయడానికి పూనుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు ఏర్పాటు కాకుండా చేశారు. బీసీలను రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు. గుడివాడలో సభ పేరుతో రాద్దాంతం సృష్టించడం, బీసీ మహిళను అడాం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

జగన్ రెడ్డి హత్యా రాజకీయాలు
వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, ఒక దళిత వృద్ధుడిని కారుతో తొక్కించి చంపడం, వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం వంటి ఆరోపణలు చేశారు. "పేర్ని నాని పామర్రు సభలో ‘చీకట్లో కన్ను కొడితే నరికేయాలి’ అని మాట్లాడారు. ఇలాంటి రాక్షస ఆలోచనలు వైసీపీ నాయకులకు సర్వసాధారణం" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు మానవత్వం లేని పైశాచిక రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి నీచ ఆలోచనలను గుర్తిస్తున్నారని హెచ్చరించారు.

కూటమి అభివృద్ధి ప్రయత్నాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి రవీంద్ర తెలిపారు. "పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మా నాయకులు తాపత్రయపడుతున్నారు. కానీ, వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అశాంతిలోకి నెట్టాలని చూస్తున్నారు" అని ఆయన విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం, స్టీల్ ప్లాంట్ లాభాల బాట, ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఆర్థిక సహాయం వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన ఉదాహరించారు.

వైసీపీకి ప్రజల హెచ్చరిక
వైసీపీ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు, కుట్రలు కొనసాగిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి హెచ్చరించారు. "వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా బుద్ధి రాలేదు. ప్రజలు వారి దుర్మార్గాలను మరచిపోలేదు. రాష్ట్రంలో వైసీపీ జాడ కూడా లేకుండా పోతుంది," అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే నాయకుడు చంద్రబాబు అని, టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

"జగన్ లాంటి రాక్షసుడిని ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. బాధపడుతున్నారు. సభలు పెట్టి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. పార్టీ సభ పెట్టుకోవాలనుకున్నావ్.. పెట్టుకోవాలి. అంతే గానీ ఆ సభను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో రక్తం పారిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా? నరుకుతాం, చంపుతాం, తొక్కుకుంటూ పోతామని రాక్షసుడిలా మాట్లాడిన నాయకుడు నీవే. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా.. దాడులు, దౌర్జన్యం కేసులు, కుట్రలతో రాష్ట్రంలో అశాంతి రేపావు. అమాయకుల్ని జైళ్లకు పంపారు. నీ అరాచకాన్ని ఇక భరించలేమని తేల్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు మీరేమైపోతారో? తెలియదు" అంటూ  కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
Kollu Ravindra
YS Jagan Reddy
TDP
YSRCP
Andhra Pradesh Politics
Krishna District
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Political Conspiracy

More Telugu News