Vijay: అజిత్ కుమార్ కస్టడీ మృతిపై నటుడు విజయ్ భారీ నిరసన ర్యాలీ

Vijay Leads Massive Protest Rally Over Ajith Kumar Custodial Death
  • పార్టీ ప్రకటన తర్వాత తొలిసారి రోడ్డుపైకి విజయ్
  • ప్లకార్డు పట్టుకొని వందలాదిమంది మద్దతుదారులతో ర్యాలీ
  • డీఎంకే హయాంలో ఇంకెన్ని కస్టడీ మరణాలను చూడాల్సి వస్తుందోనని ఆవేదన
  • అజిత్ కుమార్‌కు న్యాయం చేయాలని డిమాండ్
పోలీస్ కస్టడీలో మరణించిన ఆలయ సెక్యూరిటీగార్డు అజిత్ కుమార్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జరిగిన భారీ నిరసనలో తమిళగ వెంట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్టీని ప్రారంభించిన తర్వాత విజయ్ నిర్వహించిన తొలి నిరసన ఇదే. వందలాదిమంది మద్దతుదారులు పాల్గొన్న ఈ నిరసనలో విజయ్ మాట్లాడుతూ డీఎంకే హయాంలో పెరుగుతున్న కస్టడీ మరణాలపై ఆందోళన వ్యక్తంచేశారు. స్టాలిన్ నేతృత్వంలోని పాలనను ఆయన ‘సారీ మా మోడల్‘(క్షమించండి)గా అభివర్ణించారు. 

"ఈ ప్రభుత్వం నుంచి మనకు లభించే గరిష్ట సమాధానం ‘క్షమించండి మా’ అని విజయ్ ఎద్దేవా చేశారు. "అన్నా యూనివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు ఈ పాలనలో ఎన్ని దారుణాలను చూడాల్సి వస్తుందో. కోర్టులే జోక్యం చేసుకుని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. నల్ల చొక్కా ధరించి ‘క్షమించాల్సిన అవసరం లేదు. మాకు న్యాయం కావాలి’ అనే ప్లకార్డును పట్టుకున్న విజయ్.. డీఎంకే పాలనలో 24 మంది కస్టడీలో మరణించారని పేర్కొన్నారు. వారందరికీ మీరు క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు. వారికి కూడా క్షమాపణలు చెప్పాలని, అజిత్ కుమార్‌కు ఇచ్చినట్టే ఆ 24 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. 

కాగా,  శివగంగలోని మాదపురం కాళీ అమ్మాన్ ఆలయంలో 29 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ను ఆభరణాల దొంగతనం కేసులో ప్రశ్నించడానికి జూన్ 27న పోలీసులు తీసుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో "చనిపోయినట్టు" ప్రకటించారు. పోలీసులు మొదట్లో అతనికి మూర్ఛ వ్యాధి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో 44 గాయాలు,  తీవ్రమైన అంతర్గత రక్తస్రావం అయినట్టు తేలింది. దీంతో ఇది కస్టడీ మరణంగా నిర్ధారించారు. ఈ కేసు తమిళనాడు రాజకీయాలను వేడెక్కించింది. కస్టడీలో హింసకు గురైన 18 మంది కుటుంబాలను విజయ్ కలిసిన తర్వాత ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు.  
Vijay
Actor Vijay
Ajith Kumar
Custodial Death
Tamil Nadu
DMK government
MK Stalin
Police Custody
Protest Rally
Justice for Ajith Kumar

More Telugu News