Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం

Kota Srinivasa Rao Death AP CM Chandra Babu Nara Lokesh Condolences
  • కోట కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్న సీఎం చంద్రబాబు
  • కోట మృతి సినీరంగానికి తీరనిలోటన్న చంద్రబాబు, లోకేశ్
  • తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోట ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారన్న లోకేశ్ 
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

**తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోటకు ప్రత్యేకస్థానం.. నారా లోకేశ్**

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని, ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. 
Kota Srinivasa Rao
Chandra Babu Naidu
Nara Lokesh
Telugu cinema
Actor death
Andhra Pradesh politics
Vijayawada MLA
Tollywood
Condolences
Film industry

More Telugu News