Kota Srinivasa Rao: ‘కోట’ కూలిపోయింది: తనికెళ్ల భరణి

Revanth Reddy mourns Kota Srinivasa Rao death
  • కోట శ్రీనివాసరావు మృతికి పలువురు సంతాపం
  • సినీ రంగానికి తీరని లోటన్న సీఎం రేవంత్‌రెడ్డి
  • నాలుగు దశాబ్దాలపాటు కలిసి పనిచేశామన్న బ్రహ్మానందం
ఈ ఉదయం కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాలపాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు: రేవంత్‌రెడ్డి
కోట శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆయన తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోట సినీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం: తనికెళ్ల భరణి
కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. ఆయన మృతితో సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయిందని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నాటకాలపై ఉండే ఎనలేని ఆసక్తే ఆయన సినీ రంగ ప్రవేశానికి దారులు వేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

నమ్మలేకపోతున్నా: బ్రహ్మానందం
కోట శ్రీనివాసరావు లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. నటన ఉన్నంతకాలం ఆయన ఉంటారని పేర్కొన్నారు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని కొనియాడారు. నాలుగు దశాబ్దాలపాటు తాము కలిసి పనిచేశామని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు. కోట శ్రీనివాసరావును చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నుంచి నేర్చుకుంటూ పెరిగానని ప్రముఖ నటుడు రవితేజ అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు తనకు మధుర జ్ఞాపకాలన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 
Kota Srinivasa Rao
Telugu actor
Tollywood
Revanth Reddy
Tanikella Bharani
Brahmanandam
Ravi Teja
Telugu cinema
film industry
obituary

More Telugu News