Allu Arjun: అట్లీ దర్శకత్వంలో మూవీ... నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్!

Allu Arjun in Atlee Film Playing Four Characters
  • అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న మరో భారీ చిత్రం
  • AA 22 (వర్కింగ్ టైటిల్)గా ప్రచారంలో ఉన్న అర్జున్ తాజా చిత్రం 
  • మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో అభిమానులను కనువిందు చేయనున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో మరో భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. AA 22 (వర్కింగ్ టైటిల్)గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రలకు సంబంధించి కొన్ని రోజులుగా పలు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అర్జున్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బన్నీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అట్లీ ఆలోచనకు ఫిదా అయిన బన్నీ ఆయా పాత్రల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. అయితే, హీరో అర్జున్ పాత్రలకు సంబంధించి చిత్ర నిర్మాణ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంత వరకు రాలేదు. ఒకవేళ తాజాగా వచ్చిన కథనాలు నిజమైతే ఒక సినిమా కోసం విభిన్నమైన పాత్రల్లో బన్నీ నటించడం ఇదే తొలిసారి అవుతుంది.

పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉంటే సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది రూపొందనుందని టాక్. దీని కోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. ఈ క్రమంలో హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు దీపికా పదుకొణె అని ఇప్పటికే చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. మిగిలిన హీరోయిన్లకు సంబంధించి జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. హాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర హీరోని ఇందులో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
Allu Arjun
Atlee
AA 22
Deepika Padukone
Sun Pictures
Telugu cinema
Indian movies
Bollywood
Science fiction movie
Janhvi Kapoor

More Telugu News