Pawan Kalyan: పవన్ కల్యాణ్ చరిత్ర తెలుసుకోవాల్సింది: 'హిందీ భాష' వ్యాఖ్యలపై నందిని సిధారెడ్డి విమర్శలు

Nandini Sidhareddy Slams Pawan Kalyans Hindi Language Comments
  • తెలుగు భాషకు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉందన్న నందిని సిధారెడ్డి
  • హిందీ భాషకు 700 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉందని వ్యాఖ్య
  • తెలుగు కంటే తర్వాత పుట్టిన హిందీ పెద్దమ్మ ఎలా అవుతుందని పవన్‌కు ప్రశ్న
హిందీ భాష విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి స్పందించారు. తెలుగును అమ్మగా, హిందీని పెద్దమ్మగా పవన్ కల్యాణ్ అభివర్ణించగా, ఆయన కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని నందిని సిధారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషను పెద్దమ్మ అని సంబోధించారు. హిందీ భాషను మనదిగా భావించాలని, ఈ భాషను నేర్చుకోవడం ద్వారా భారతీయులు మరింత బలపడతారని ఆయన అన్నారు. హిందీని నేర్చుకోవడం అంటే ఉనికిని కోల్పోవడం కాదని, మరింత బలపడటమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై నందిని సిధారెడ్డి స్పందిస్తూ, పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చి హిందీ భాష గురించి మాట్లాడారని, ఆయనను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానని అన్నారు. తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, కానీ హిందీ భాషకు ఏడు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు. "ముందు పుట్టింది (తెలుగు) పెద్దమ్మ అవుతుందా, తర్వాత పుట్టింది (హిందీ) పెద్దమ్మ అవుతుందా? కనీసం వయస్సు రీత్యా అయినా మాట్లాడాలి కదా" అని ఆయన ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ లాంటి వారు కేవలం రాజకీయ సమీకరణాల కోణంలో మాట్లాడుతూ హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని నందిని సిధారెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్ ఒక తెలుగువాడై ఉండి కూడా హిందీని పెద్దమ్మ అని చెప్పడం విడ్డూరంగా ఉందని, కనీసం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఉందని, హిందీ భాషకు లేదనే విషయం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
Pawan Kalyan
Nandini Sidhareddy
Hindi language
Telugu language
language controversy

More Telugu News