Chinni: సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తని నదిలోకి తోసిన భార్య... కానీ బతికాడు!

Wife throws husband into Krishna River during selfie attempt in Karnataka
  • కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఘటన
  • కృష్ణా నది వద్దకు విహార యాత్రకు వెళ్లిన తాయప్ప, చిన్ని దంపతులు
  • భార్య నదిలోకి తోసేసిన వైనం... భర్తను కాపాడిన గ్రామస్థులు
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కద్లూరు వద్ద సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను కృష్ణా నదిలోకి తోసివేసిన ఘటన కలకలం రేపింది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. నదిలో పడిపోయిన భర్తను గ్రామస్థులు చాకచక్యంగా రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే... తాయప్ప, చిన్ని దంపతులు కృష్ణానది ఒడ్డున విహార యాత్రకు వచ్చారు. ఇద్దరూ సెల్ఫీలు తీసుకుంటుండగా, భార్య చిన్ని తన భర్త తాయప్పను ఒక్కసారిగా నదిలోకి తోసివేసింది. ఊహించని ఈ పరిణామంతో తాయప్ప నీటిలో పడిపోయి ప్రాణాల కోసం అల్లాడాడు. అయితే, అతడు నీట మునుగుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు.

ఈ ఘటనపై తాయప్ప స్పందిస్తూ, తన భార్య చిన్ని తనను చంపడానికి పథకం ప్రకారం నదిలోకి తోసిందని ఆరోపించాడు. తాను ప్రమాదవశాత్తు నదిలో పడిపోయినట్లుగా తన బంధువులకు ఫోన్ చేసి చెప్పిందని తెలిపాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చిన్ని ఇలా చేయడానికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. 
Chinni
Karnataka
Krishna River
Husband thrown in river
Rayachur
Kadlur
Attempted murder
Domestic dispute
Crime news
Wife accused

More Telugu News