Madhav: ఏపీ బీజేపీ చీఫ్ అఖండ్ భారత్ చిత్రపటం బహూకరణ... ఆ పటంతో కౌంటర్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ

Madhav Gifted Akhand Bharat Map to Telangana BJP Countering Criticism
  • రామచంద్రరావుకు తెలంగాణతో కూడిన అఖండ భారత్ చిత్రపటాన్ని బహూకరించిన మాధవ్
  • చిత్రపటంలో అభ్యంతరాలు వెతకడమంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లేనన్న తెలంగాణ బీజేపీ
  • నిజాం వారసుల ముందు తలవంచిన వారికి తెలంగాణ విలువలు అర్థం కావని మాధవ్ విమర్శ
  • సోదర తెలంగాణ రాష్ట్రం పట్ల నా ప్రేమను ఎవరూ తగ్గించలేరన్న మాధవ్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన సందర్భంగా ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన అఖండ్ భారత్ చిత్రపటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఈరోజు కౌంటర్‌ ట్వీట్ చేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు తెలంగాణతో కూడిన అఖండ్ భారత్ చిత్రపటాన్ని మాధవ్ బహూకరించారు. ఈ చర్యతో 'ఎక్స్' వేదికగా జరుగుతున్న విమర్శలకు తెలంగాణ బీజేపీ గట్టిగా బదులిచ్చింది.

అఖండ భారతావని యొక్క అమోఘమైన చరిత్రను తెలియజేసే చిత్రపటంలో అభ్యంతరాలు వెతకడం అనేది కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంటుందని తెలంగాణ బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది.

మాధవ్ ఈరోజు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా రామచంద్రరావును కలిసి అభినందనలు తెలియజేశారని, భారత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఒక చిత్రపటాన్ని అందజేసి తమ ఆప్యాయతను, సోదర భావాన్ని, తెలంగాణ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని ఆ పార్టీ తెలిపింది.

మాధవ్ ట్వీట్.. తెలంగాణ బీజేపీ రీట్వీట్

"తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు గీసేవారు చరిత్ర ముందు లొంగిపోక తప్పదు” అంటూ మాధవ్ తన ట్వీట్‌ను ప్రారంభించారు. ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని, తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య బంధాన్ని చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

"నేను ఒక జాతీయవాదిని. ఒక గర్వించదగిన తెలుగువాడిని. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో, శాసనాల్లో చురుకుగా పనిచేశాను. తెలంగాణ పట్ల, ఆ గొప్ప సంస్కృతి పట్ల నాకు ఉన్న ప్రేమ, గౌరవం రాజకీయ విమర్శలకు అతీతం. రజాకార్లను పొగిడే, నిజాం వారసుల ముందు తల వంచిన వారికి, తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావు. నాకు సోదర తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు, మార్చలేరు" అని ఆయన స్పష్టం చేశారు.
Madhav
AP BJP Chief
Telangana BJP
Akhand Bharat
Nara Lokesh
BJP Telangana
Ramachandra Rao
Telugu states
Telugu culture
Indian culture

More Telugu News