Laxman: బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: లక్ష్మణ్

Revanth Reddy Government Deceiving BCs Alleges Laxman
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
  • ఆర్డినెన్స్ కు గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారన్న లక్ష్మణ్
  • జనాభా గణాంకాలను బయటపెట్టాలని డిమాండ్
బీసీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయడమంటే బీసీలను మరోసారి మోసగించడమేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందని... ఆ బిల్లుపై ఏమీ తేల్చకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రపతి వద్ద 42 శాతం రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే... ఆ ఆర్డినెన్స్ కి గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రిజర్వేషన్లలో వివిధ కులాలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. జనాభా గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన నిలబడే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలోని కమిషన్ బాధ్యతలను ఎందుకు సక్రమంగా నిర్వర్తించలేదని ప్రశ్నించారు. కులాలకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Laxman
Revanth Reddy
BC Reservations
Telangana Government
Local Body Elections
State Government Bill
President of India
Burra Venkatesham Commission
BJP Telangana
Reservation Ordinance

More Telugu News