AP BJP Chief Madhav: బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కౌంటర్

AP BJP Chief Madhav Counters BRS Leaders Criticism
  • లోకేశ్ కు మాధవ్ సమర్పించిన భారత చిత్రపటంపై బీఆర్ఎస్ విమర్శలు
  • ఉమ్మడి ఏపీ ముద్రించడంపై విమర్శలు
  • ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాధవ్ మండిపాటు
ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు బహూకరించిన భారత చిత్రపటం తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాప్ లో ఏపీ, తెలంగాణ విడివిడిగా కాకుండా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా... ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. 

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును ఈరోజు మాధవ్ కలిశారు. రాంచందర్ రావుకు కూడా అదే భారతీయ సాంస్కృతిక వైభవం మ్యాప్ ను బహూకరించారు. అయితే, ఈ మ్యాప్ లో తెలంగాణ, ఏపీలను వేర్వేరుగా చూపించారు. 

మరోవైపు, బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ మాధవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓట్ల కోసం ఫొటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య బంధాలను చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు గీసే వారు చరిత్ర ముందు లొంగవలసిందేనని అన్నారు. తాను ఒక జాతీయవాదినని, ఒక గర్వపడే తెలుగువాడినని... తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో చురుకుగా పని చేసినవాడినని చెప్పారు. 

రజాకార్లను పొగిడే వారికి, నిజాం వారసుల ముందు తల వంచిన వారికి తెలంగాణ ప్రజల్లో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం ఎప్పటికీ అర్థం కావని అన్నారు. సోదర రాష్ట్రం పట్ల తనకున్న ప్రేమ, గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి... 'భారతీయ సాంస్కృతిక వైభవం'కు సంబంధించిన చిత్రాన్ని బహూకరించడం సంతోషంగా ఉందని అన్నారు.
AP BJP Chief Madhav
Madhav AP BJP
Chandrababu Naidu
Telangana BJP
BRS Party
KTR BRS
Telangana Politics
Andhra Pradesh Politics
Telugu Unity
Ramchander Rao

More Telugu News