DK Shivakumar: కుర్చీ దొరకడం అంత ఈజీ కాదు.. డీకే శివకుమార్ వ్యాఖ్య

DK Shivakumar Speech on Empty Chairs Fuels CM Speculation
  • కుర్చీ కోసం మేం ఆరాటపడుతుంటే మీరేమో కుర్చీ దొరికినా కూర్చోవట్లేదు
  • బెంగళూరు అడ్వొకేట్ల సమావేశంలో డీకే వ్యాఖ్యలు
  • సీఎం కుర్చీ వివాదం నేపథ్యంలో వైరల్ గా మారిన కామెంట్స్
‘మేం (రాజకీయ నాయకులు) కుర్చీ కోసం ఆరాటపడుతుంటే మీరు (అడ్వొకేట్లు) మాత్రం కుర్చీ ఖాళీగా ఉన్నా కూర్చోవడంలేదు’ అంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం కోసం కొంతకాలంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తుండగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీటును వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. ఈ విషయంపై ఇటీవల డీకే వర్గం ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని డీకే వర్గం నేతలు అంటున్నారు. అయితే, ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా తాజాగా శుక్రవారం బెంగళూరులో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కెంపెగౌడ జయంతి వేడుకలకు డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ.. సభలో చాలా కుర్చీలు ఖాళీగానే ఉన్నప్పటికీ లాయర్ మిత్రులు కూర్చోవడంలేదని అన్నారు. కుర్చీ విలువ బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చని, ఖాళీగా కనిపిస్తే వెంటనే కూర్చోవాలని వ్యాఖ్యానించారు. తాము కుర్చీ కోసం ఎంతగానో ఆరాటపడతామని చెబుతూ మీరు మాత్రం ఇతరుల కోసం కుర్చీని త్యాగం చేస్తున్నారని చెప్పారు. దీంతో సభలో నవ్వులు విరిసాయి. కర్ణాటక సీఎం కుర్చీని దృష్టిలో పెట్టుకునే డీకే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా తెలిసిపోతోందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
DK Shivakumar
Karnataka
Karnataka politics
Siddaramaiah
Chief Minister
Congress
Kempegowda Jayanti
Advocates Association
power sharing
political comments

More Telugu News