Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయాను: అనిల్ కుంబ్లే

Nitish Kumar Reddy Bowling Surprised Me Says Anil Kumble
  • లార్డ్స్ టెస్టు తొలి రోజున ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి
  • ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బకొట్టిన తెలుగుతేజం
  • అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలన్న కుంబ్లే
  • ఒకవేళ విఫలమైనా నితీశ్ పై వేటు వేయొద్దని సూచన
తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్టు తొలిరోజున ప్రభావంతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా... నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బకొట్టాడు. దీనిపై టీమిండియా బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు. 

నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు. సరైన ప్రదేశాల్లో బంతులు సంధించాడని కితాబిచ్చాడు. తొలి వికెట్ లెగ్ సైడ్ బంతితో ఏదో యాదృచ్ఛికంగా వచ్చినట్టు అనిపించినా, రెండో వికెట్ మాత్రం అద్భుతమైన బంతితో సాధించాడని కుంబ్లే కొనియాడాడు. తొలి రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డితో 14 ఓవర్లే వేయించారని, కానీ ఇంకా మరికొన్ని ఓవర్లు వేసే ఉత్సాహం అతడిలో కనిపించిందని వివరించాడు. 

ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేసి బ్యాటింగ్ లో సత్తా చాటాడని, ఆ సిరీస్ లో మరిన్ని వికెట్లు తీయలేకపోయినా, బ్రేక్ ఇవ్వగల బౌలర్ అని నిరూపించుకున్నాడని కుంబ్లే స్పష్టం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాకుండా, ఫీల్డింగ్ లోనూ చురుగ్గా కదిలే సామర్థ్యం నితీశ్ కుమార్ రెడ్డికి ఉందని అన్నాడు. అందుకే, నితీశ్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, అతడిని జట్టు నుంచి తొలగించే పనులు చేయొద్దని కుంబ్లే హితవు పలికాడు. ఒకవేళ అతడు విఫలమైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి విషయంలో బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించాడు. 
Nitish Kumar Reddy
Anil Kumble
Lords Test
Indian Cricket
Telugu Player
Bowling Performance
Cricket Analysis
BCCI
England Cricket
All-rounder

More Telugu News