Rangaraaya Medical College: కాకినాడ రంగరాయ కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు

Rangaraaya Medical College Students Face Sexual Harassment in Kakinada
  • బీఎస్సీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థినులపై సిబ్బంది వేధింపులు
  • అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించిన ప్రిన్సిపల్
  • తమ బాధలు చెప్పుకున్న 50 మంది విద్యార్థినులు
  • తమను ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బంది బెదిరింపులు
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు. 

ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు. ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది.

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సిబ్బందిలో ఇద్దరు బెదిరించినట్టు కూడా తెలిసింది. తాను శాశ్వత ఉద్యోగినని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ల్యాబ్ సహాయకుడు ఒకరు విద్యార్థినులను బెదిరించినట్టు కూడా సమాచారం. అంతేకాదు, కొందరు ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని కూడా కమిటీకి తెలిపారు. అయితే, తాము ఎవరిపట్లా అసభ్యంగా ప్రవర్తించలేదని విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. వేధింపుల వ్యవహారం నిజమేనని, విచారణ జరిపించామని, ఇందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉందని ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ చెప్పారు. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Rangaraaya Medical College
Kakinada
student harassment
sexual harassment
Andhra Pradesh
Visnuvardhan
lab assistant
medical lab technology
education
college staff

More Telugu News