TV Rama Rao: టీవీ రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!

TV Rama Rao Suspended from Janasena Party
  • సొసైటీ నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ టీవీ రామారావు ఆధ్వర్యంలో ఆందోళన
  • అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించడంపై అధిష్ఠానం సీరియస్ 
  • కూటమి స్పూర్తికి విఘాతం కల్గించేలా రామారావు చర్యలు ఉన్నాయన్న పార్టీ అధిష్టానం
  • పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ
కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త టి.వి. రామారావుపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ఈ మేరకు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టి.వి. రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళన చేశారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో కూడా నిర్వహించారు.

కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉన్నాయి. వీటిలో మూడు పదవులు తమకు కేటాయించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.వి. రామారావు డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో ఆందోళన నిర్వహించారు. అయితే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా టి.వి. రామారావు ఆందోళన చేయడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది.

పార్టీ విధి విధానాలకు భిన్నంగా టి.వి. రామారావు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చిందని వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగేలా చర్యలు ఉన్నందున పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడం జరిగిందన్నారు. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రామారావును ఆదేశించారు.

టి.వి. రామారావు 2009 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక కేసు కారణంగా రాజకీయ ఒడిదుడుకులకు గురైన ఆయనకు పార్టీ టికెట్ లభించలేదు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో కె.ఎస్. జవహర్ గెలుపుకు మద్దతుగా ప్రచారం చేశారు.

2019లోనూ తెదేపా అధిష్టానం మరోసారి మొండి చేయి చూపించింది. దీంతో అదే సంవత్సరం టి.వి. రామారావు వైకాపాలో చేరారు. కొవ్వూరు నుంచి వైకాపా తరఫున పోటీ చేసిన తానేటి వనితకు మద్దతుగా నిలిచారు. 2023లో వైకాపాకు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 
TV Rama Rao
Kovvur
Janasena Party
Suspension
West Godavari
TDP
YCP
Cooperative Societies
Andhra Pradesh Politics

More Telugu News