Kapil Sharma: కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల కలకలం.. కెనడాలో ఘటన

Kapil Sharmas Cafe Shot at in Canada
  • కెనడాలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై దాడి
  • సర్రే నగరంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన
  • కేఫ్‌పై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు
  • కారులోంచి ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్టు వీడియోలో రికార్డ్
  • ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు
ప్రముఖ హాస్య నటుడు, వ్యాఖ్యాత కపిల్ శర్మకు కెనడాలో ఊహించని షాక్ తగిలింది. ఆయన కొత్తగా ప్రారంభించిన కేఫ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన కెనడాలోని సర్రే నగరంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

కపిల్ శర్మ ఇటీవల సర్రేలో ఒక కేఫ్‌ను ప్రారంభించారు. బుధవారం రాత్రిపూట కారులో వచ్చిన దుండగుడు కేఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ దాడి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

అదృష్టవశాత్తు, ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కేఫ్‌ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ఖలిస్థానీ తీవ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ దాడికి తానే బాధ్యుడినని ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. ఇతను నిషేధానికి గురైన తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన కీలక వ్యక్తి. నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో అతను ఉన్నాడు.
Kapil Sharma
Kapil Sharma cafe
Surrey Canada
Cafe shooting
Harjit Singh Ladhar

More Telugu News