Srihari Sukesh: కెనడాలో విషాదం.. గాలిలో విమానాలు ఢీకొని కేరళ యువ పైలట్ మృతి

Srihari Sukesh Dies in Canada Plane Crash
  • కెనడాలో శిక్షణా విమానాలు ఢీకొని ఘోర ప్రమాదం
  • ప్రమాదంలో కేరళకు చెందిన శ్రీహరి సుకేష్ దుర్మరణం
  • కెనడాకు చెందిన మరో యువ పైలట్ కూడా మృతి
  • రెండు విమానరాలు ఒకేసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించడమే కారణం!
  • సుకేష్ కుటుంబంతో టొరంటో కాన్సులేట్ సంప్రదింపులు
కెనడాలో జరిగిన విమాన ప్రమాదంలో కేరళకు చెందిన భారతీయ యువ పైలట్ ఒకరు మరణించారు. మానిటోబా ప్రావిన్స్‌లో రెండు శిక్షణా విమానాలు గాల్లో ఢీకొనడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతుడిని కేరళకు చెందిన శ్రీహరి సుకేష్ (21)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కెనడాకు చెందిన సవన్నా మే రాయ్స్ (20) అనే మరో యువ పైలట్ కూడా మరణించాడు.

శ్రీహరి, సవన్నా ఇద్దరూ మానిటోబాలోని హార్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్నారు. స్టెయిన్‌బాచ్ పట్టణం వద్ద శిక్షణలో భాగంగా చిన్న విమానాల్లో టేకాఫ్, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే రన్‌వేపై ఒకేసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో సుమారు 400 మీటర్ల ఎత్తులో వారి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ట్రైనింగ్ స్కూల్ అధ్యక్షుడు ఆడమ్ పెన్నర్ పేర్కొన్నారు.

రెండు విమానాల్లోనూ రేడియో వ్యవస్థ ఉన్నప్పటికీ, ఒకరికొకరు అత్యంత సమీపానికి వచ్చిన విషయాన్ని పైలట్లు గుర్తించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సుకేష్ వద్ద ఇప్పటికే ప్రైవేటు పైలట్ లైసెన్స్ ఉండగా, కమర్షియల్ పైలట్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు.

ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ స్పందించింది. సుకేష్ మృతిని ధృవీకరించిన అధికారులు, అతని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్థానిక పోలీసులు, పైలట్ స్కూల్ నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. హార్వ్స్ ఎయిర్ స్కూల్ ఎంతోకాలంగా పైలట్ శిక్షణ ఇస్తుండగా, ఏటా వివిధ దేశాల నుంచి వందల మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు.
Srihari Sukesh
Canada plane crash
Manitoba
Harv's Air Pilot Training School
Kerala student

More Telugu News