Thummala Nageswara Rao: చేనేత రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయండి: అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

Thummala Nageswara Rao Orders Immediate Release of Handloom Loan Waiver Funds
  • రుణమాఫీ కోసం రూ. 33 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • రాష్ట్ర వ్యాప్తంగా 5,691 మంది కార్మికులకు లబ్ధి
  • ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్లను వేగవంతం చేయాలని తుమ్మల సూచన 
చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నిధులను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్‌లో చేనేత జౌళి శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోపే ఆర్డర్లు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అందిన ఆర్డర్లకు సంబంధించిన వస్త్రాలను వేగంగా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని ఏడాదిలోగా యాదాద్రి జిల్లా పోచంపల్లికి శాశ్వతంగా తరలించాలని ఆదేశించారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి, ‘మహిళా శక్తి’ చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలన్నారు.

ఈ సమీక్షలో భాగంగా జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 33 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5,691 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని, వెరిఫికేషన్ పూర్తి కాగానే నిధులు విడుదల చేస్తామని వివరించారు. ‘నేతన్నకు చేయూత’ పథకం కింద 194 మంది మృతుల కుటుంబాలకు రూ. 9.70 కోట్లు అందించినట్లు ఆమె పేర్కొన్నారు.

అనంతరం, 2024 సంవత్సరానికి గాను జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికైన పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద, గూడ పవన్‌లను మంత్రి తుమ్మల శాలువాతో సత్కరించారు. తెలంగాణ చేనేతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం గర్వకారణమని, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. 
Thummala Nageswara Rao
Telangana
Handloom Weavers
Loan Waiver
Textile Industry
Konda Laxman Bapuji IIHT
Pochampally
Weavers Welfare
Telangana Handlooms
Nethannaku Cheyutha Scheme

More Telugu News