Nara Lokesh: చంద్రబాబు కాళ్లకు నమస్కరించిన నారా లోకేశ్

Nara Lokesh Bows to Chandrababu Naidu Blessing
  • పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
  • చంద్రబాబుతో కలిసి పాల్గొన్న లోకేశ్
  • ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు చెప్పిన చంద్రబాబు, విద్యార్థిగా మారి శ్రద్ధగా విన్న లోకేశ్
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ముందుగా జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు పాదాలకు మంత్రి నారా లోకేశ్ నమస్కరించారు. అనంతరం తల్లుల గొప్పదనంతో పాటు తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వాల్స్ ను ముఖ్యమంత్రితో కలిసి వీక్షించారు. ఫొటోలు దిగారు. అనంతరం ఎన్ సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం మధ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు.

ముందుగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న చంద్రబాబు, లోకేశ్ పదో తరగతి విద్యార్థులతో ఇష్జాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం హాజరు మొదలైన అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన పదో తరగతి ఏ సెక్షన్ కు చెందిన పి.రిహాన్ బాష, పి.జిగ్ను ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. వారి మార్కులను అడిగి తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇంకా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్ కు గైర్హాజరైన విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఆగస్టు నుంచి మెసేజ్ రూపంలో తెలియజేయజేస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తెలిపారు.  

పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి బి సెక్షన్ కు చంద్రబాబు, లోకేశ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు ‘వనరులు’ అనే సబ్జెక్ట్ పై క్లాస్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిగా మారిన నారా లోకేశ్.. ముందు బెంచీలో కూర్చొని సీఎం చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. మానవ వనరులు అంటే ఏమిటి, సహజ వనరులు, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులపై విద్యార్థులకు ముఖ్యమంత్రి పాఠం బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులకు చెప్పారు. సమాజంలో మార్పు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. 

లోకేశ్ ను ప్రశంసించిన చంద్రబాబు

భవిష్యత్ లో విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెట్ ప్లేయర్లు కావాలనుకునేవారు చేతులు పైకి ఎత్తాలని సూచించారు. వారంతా తమ లక్ష్యాన్ని చేతులు పైకి ఎత్తి చెప్పారు. విద్యార్థులకు ఆశయం ఉండాలని.. ఆశయ సాధన కోసం ఇప్పటినుంచే కష్టపడి చదవాలని మార్గదర్శకం చేశారు. అందరికీ గుడ్ లక్.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజకీయ నాయకులు కావాలనుకునేవారు చేతులు ఎత్తాలని ఈ సందర్భంగా లోకేశ్ అడగగా.. ఎవరూ చేయి పైకి ఎత్తలేదంటూ నవ్వులు పూయించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. "లోకేశ్ బాగా చదువుకున్నారు, మంత్రి అయ్యారు, తల్లికి వందనం అమలు చేశారా, లేదా.. పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారు" అంటూ ఆయనను ప్రశంసించారు.
Nara Lokesh
Chandrababu Naidu
AP Politics
Talli ki Vandanam
Satyasai District
Education System
Andhra Pradesh
Student Interaction
Teacher Parent Meeting
Holistic Progress Card

More Telugu News