రష్యా పర్యటనకు వెళ్లిన భారతీయుల అక్రమ అరెస్టు
- మాస్కోలో 9 మంది భారతీయుల నిర్బంధం.. అమానవీయంగా ప్రవర్తించిన అధికారులు!
- చిన్న గదిలో బంధించి, ఫోన్లు తనిఖీ చేశారని బాధితుల ఆరోపణ
- నేరస్థుల్లా చూశారని బాధితుడు అమిత్ తన్వర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన
- బాధితులను అజర్‌బైజాన్ మీదుగా భారత్‌కు తిప్పి పంపిన రష్యా
వివరాల్లోకి వెళితే.. జులై 8న అమిత్ తన్వర్ మరో 11 మంది భారతీయులతో కలిసి మాస్కో విమానాశ్రయంలో దిగారు. అయితే, ముగ్గురిని మాత్రమే దేశంలోకి అనుమతించిన అధికారులు, అమిత్‌తో సహా 9 మందిని ఎలాంటి కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని, ఫోన్లు లాక్కున్నారు. ఫోన్‌లోని ఫొటో గ్యాలరీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ, యూట్యూబ్ యాక్టివిటీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారని తన్వర్ తెలిపారు.
అనంతరం వారిని ఓ చిన్న గదిలో బంధించి, వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారని వాపోయారు. "మమ్మల్ని నేరస్థుల్లా చూశారు. రోజుకు రెండుసార్లు మాత్రమే కొద్దిగా అన్నం, ఉడికించిన కూరగాయలు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ ప్రవర్తన చాలా అమానుషంగా ఉంది," అని అమిత్ వివరించారు. సొంత ఖర్చులతో టికెట్లు బుక్ చేసుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదని, వారిని అజర్‌బైజాన్‌లోని బాకు మీదుగా చిన్న చిన్న బృందాలుగా వెనక్కి పంపారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. గురువారం తెల్లవారుజామున తాను ముంబైకి చేరుకున్నట్లు అమిత్ తన్వర్ తన పోస్టులో తెలిపారు.