Chandrababu Naidu: మాస్టారుగా మారిన ముఖ్యమంత్రి.. పుట్టపర్తి స్కూలులో చంద్రబాబు పాఠాలు.. వీడియో ఇదిగో!

Chandrababu Naidu becomes teacher at Puttaparthi school



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టారుగా మారారు.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ రోజు ఉదయం పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్ లో చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాస్టారుగా మారి వారికి బోధించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా కొత్తచెరువు జెడ్పీ స్కూల్ కు వెళ్లారు. సీఎం చంద్రబాబుకు ఎన్సీసీ కేడెట్ లు గౌరవ వందనం సమర్పించి స్వాగతించారు.

పాఠశాల ఆవరణలో విద్యార్థులు, వార తల్లిదండ్రులతో చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను మంత్రి నారా లోకేశ్ తో కలిసి తిలకించారు. అనంతరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్ లో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా స్కూలు క్యాంపస్ ను పరిశీలించిన చంద్రబాబు.. క్యాంపస్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు సీఎం చంద్రబాబు కొద్దిసేపు పాఠాలు బోధించారు.

విద్యార్ధుల తల్లితండ్రులకు, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తూ.. మార్కులు పెంచుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. హాజరు, మార్కుల వివరాలను తల్లిదండ్రులకు వివరించి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తోంది. 

వరుసగా రెండో ఏడాది విద్యార్థుల తల్లిదండ్రులు- ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 61 వేల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ వేదిక ద్వారా పాఠశాల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ తల్లుల పేరిట విద్యార్థులు మొక్కలు నాటనున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Puttaparthi
school visit
parent teacher meeting
Nara Lokesh
education
government schools
student interaction
progress cards

More Telugu News