Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

Krishna Water Dispute Uttam Kumar Reddy Blames Previous Government
  • ఏపీకి మేలు చేసేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిందన్న ఉత్తమ్
  • రాయలసీమ లిఫ్ట్ టెండర్లకు పరోక్షంగా సహకరించారని విమర్శ
  • పదేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని వ్యాఖ్య
గత పదేళ్ల పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకు జరిగిన కుట్ర అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రం తన హక్కులను కోల్పోయిందని ఆయన విమర్శించారు. బుధవారం ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను గత పదేళ్లలో పూర్తి చేసి ఉంటే, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా దక్కేది. కానీ, గత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది" అని అన్నారు. అంతేకాకుండా, 2016లో కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్‌కు గత ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలిపిందని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టినా గత ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని ఉత్తమ్ ఆరోపించారు. "రాయలసీమ లిఫ్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కుట్రపూరితంగా వాయిదా వేశారు. దీనివల్ల ఏపీకి మేలు జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2019కి ముందే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Uttam Kumar Reddy
Krishna River
Telangana
Andhra Pradesh
Irrigation Projects
Water Dispute
SLBC Project
Kalwakurthy Project
Nettempadu Project
Rayalaseema Lift Irrigation Scheme

More Telugu News