Ramyakrishna: మరో 'శివగామి'గా మళ్లీ రమ్యకృష్ణ కనిపించేనా?

Ramyakrishna special
  • 'శివగామి'గా గుర్తుండిపోయిన రమ్యకృష్ణ
  • ఆమె కెరియర్లో నిలిచిపోయిన పవర్ఫుల్ రోల్  
  • ఆ స్థాయి పాత్రలో మళ్లీ ఆమెను చూడాలనే ఆడియన్స్ 
 వెండితెరపై కథానాయికలకు గ్లామరస్ గా మెరిసే పాత్రలే ఎక్కువగా వస్తాయి. అలాగే కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత సర్దుకుపోయే అవకాశాలే ఎక్కువగా పలకరిస్తాయి. అయితే హీరోయిన్ గా చేస్తున్నప్పుడు చేసిన 'నీలాంబరి' పాత్ర .. కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన తరువాత చేసిన 'శివగామి' పాత్ర రమ్యకృష్ణను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి. ఈ రెండూ కూడా పవర్ఫుల్ పాత్రల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాయి. 'బాహుబలి' సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అయినా 'శివగామి' పాత్రను ఇంతవరకూ ఎవరూ మరిచిపోలేదు. రమ్యకృష్ణ లుక్ .. ఆమె హావభావ ప్రకటన .. ఆ పాత్రకి ఆమె తీసుకొచ్చిన నిండుదనం ప్రతి ఒక్కరూ కంటి తెరపై .. మనసు పొరపై ఇంకా కదులుతూనే ఉంది. ఈ సినిమా తరువాత ఈ తరహా పాత్రలలో రమ్యకృష్ణ మరింత విజృంభించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వాళ్ల అంచనా కొంతవరకూ మాత్రమే నిజమైంది. 'శివగామి' పాత్రతో రమ్యకృష్ణ ఒక ల్యాండ్ మార్క్ ను సెట్ చేసి పెట్టారు. ఆ తరువాత ఆ పాత్ర దరిదాపులలోకి ఆమెను మరోసారి తీసుకెళ్లడం సాధ్యపడలేదనే చెప్పాలి. శైలజా రెడ్డి అల్లుడు .. రిపబ్లిక్ .. లైగర్ .. గుంటూరు కారం వంటి సినిమాలలో ఆమె చాలా కీలకమైన పాత్రలనే పోషించారు. కానీ ఆ పాత్రలలోని పవర్ ఆడియన్స్ కి సరిపోలేదు. వాళ్ల అంచనాలకు దగ్గరగా లేదు. అందువలన మరోసారి 'శివగామి' స్థాయి పాత్రలో రమ్యకృష్ణను చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ల నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందనేది చూడాలి మరి. 

Ramyakrishna
Sivagami
Baahubali
Shailaja Reddy Alludu
Republic movie
Liger movie
Guntur Kaaram
Telugu cinema
Powerful roles
Character artist

More Telugu News